శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 08:47:09

తెలంగాణ క‌శ్మీరం @ ఆదిలాబాద్‌

తెలంగాణ క‌శ్మీరం @ ఆదిలాబాద్‌

  • అడవుల అందాలు.. జలపాతాల సవ్వడులు..  
  • వెండి, బుల్లితెర షూటింగ్‌లకు నిలయం
  • ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్యబొమ్మలు  
  • ఆధ్యాత్మిక క్షేత్రాలుగా బాసిల్లుతున్న పురాతన ఆలయాలు 
  • జంతువుల సంరక్షణ కేంద్రాలు.. 
  • నేడు జాతీయ పర్యాటక దినోత్సవం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పర్యాటక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ కశ్మీరంగా పిలువబడే జిల్లాలో గలగలపారే జలపాతాలు, ఎత్తైన కొండలు, అభయారణ్యాలు, కొండలను చీల్చుకుంటూ సాగే ఎత్తైన మహబూబ్‌, కెరిమెరి ఘాట్స్‌ ప్రయాణం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్‌ కొయ్యబొమ్మలు, సరస్వతీ నిలయమైన బాసర, ప్రాచీన ఆలయాలైన జైనథ్‌ లక్ష్మీనారాయణ స్వామి, సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయాలు, కోటలు, బురుజులు, కుంటాల, పొచ్చెర, వాస్తాపూర్‌ జలపాతాలు, కవ్వాల్‌ అభయారణ్యం, కడెం బోటింగ్‌, ఉమ్మడి జిల్లా చుట్టూ గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ, జన్నారం జంతువుల పార్కు.. ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలుగా బాసిల్లుతున్నాయి. స్వరాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుతో పాటు పాత, కొత్త జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించడంతో పర్యాటకరంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కనుమరుగైన పర్యాటక అందాలు స్వరాష్ట్రంలో నిధులు వెచ్చించడంతో వెలుగులోకి వస్తున్నాయి.  - నిర్మల్‌ అర్బన్‌, జనవరి 24 

అడవుల అందాలు..

ఆదిలాబాద్‌ జిల్లా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి అడవులు. ఉమ్మడి జిల్లాలో 7000 చ.కి.మీటర్ల మేరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో 2000 చ.కి.మీటర్లు కవ్వాల్‌ అభయారణ్యం విస్తరించి ఉంది. 893 చ.కి.మీటర్లు కోర్‌ ఏరియా ప్రాంతం, 1107 చ.కి.మీటర్లు బఫర్‌ ఏరియా ప్రాంతంలో అడవులు విస్తరించి ఉన్నాయి. 

జలపాతాల సవ్వడులు..

అటవీ ప్రాంతాల్లోనే అందమైన జలపాతాలు ఉన్నాయి. కండాల, కుంటాల, పొచ్చెర, వాస్తాపూర్‌ జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఈ జలపాతాలకు  నీరు వచ్చి చేరడంతో వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అందాలను తిలకిస్తున్నారు.


చారిత్రక ఆనవాళ్లు..

జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు చారిత్రక ఆనవాళ్లుగా ఉన్నాయి. కడెం జలాశయం, అందులో బోటింగ్‌, ఖానాపూర్‌ సదర్మాట్‌ ఆనికట్‌, జన్నారం జంతువుల పార్కు, జోడెఘాట్‌, నిర్మల్‌ గండి రామన్న హరితవనం, మూషిక జింకల పార్క్‌తో పాటు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న లక్షెట్టిపేట్‌లో పురాతన చర్చి, సోన్‌ పాత బ్రిడ్జి, శ్యామ్‌ గఢ్‌, బత్తీస్‌ గఢ్‌ కోటలున్నాయి. 

ఆధ్యాత్మిక క్షేత్రం..

ఆధ్యాత్మిక కేత్రంగా నిర్మల్‌ జిల్లా బాసర వెలుగొందు తున్నది. దేశంలో రెండో సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది.  చదువుల తల్లిగా కొలిచే ఈ ఆలయానికి వివిధ రాష్ర్టాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇటీవల రూ.7.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. వీటితో పాటు ప్రసిద్ధి చెందిన కదిలి, జైనథ్‌, సిరిచెల్మతో పాటు అనేక ప్రాచీన ఆలయాలతో పర్యాటక రంగంగా జిల్లా అభివృద్ధి చెందుతున్నది. 


గ‌ల‌గ‌ల పారే న‌దులు.. 

ఉమ్మడి జిల్లాలో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల ప్రవాహం కనిపిస్తుంటుంది. ఈ నదులన్నీ మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటాయి. పలు ఆలయాలు కూడా  ఈ తీరంలో ఉండడంతో, భక్తుల పుణ్యస్నానాలకు నెలవుగా ఉన్నాయి.  పుష్కరాల సందర్భంలో ఈ నదుల వద్ద భక్తుల కోలాహలం కనిపిస్తుంది.  

మొసళ్ల సంరక్షణ కేంద్రం ఎల్‌ మడుగు..

జైపూర్‌ మండలంలోని శివ్వారం సమీపంలో మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ బోటింగ్‌తో పాటు పార్కును ఏర్పాటు చేశారు. గోదావరిలో ఉన్న మడుగు ప్రాంతంలో మొసళ్లను సంరక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇందారం నుంచి ఇక్కడికి వెళ్లవచ్చు. చెన్నూర్‌ పట్టణం నుంచి కూడా వెళ్లే వీలుంది.

కట్టిపడేస్తున్న ఘాట్‌ అందాలు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవులు దట్టంగా విస్తరించి ఉన్నాయి. వీటిని చీల్చుకుంటూ వెళ్లే ఘాట్స్‌ ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.  నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్లే, గుడిహత్నూర్‌ నుంచి ఆసిఫాబాద్‌ వెళ్లే మార్గంలో వంపులు తిరిగిన ఎత్తయిన రహదారి కనువిందు చేస్తున్నది. ఈ మార్గంలో ప్రయాణానికి జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారు ఇష్టపడుతారు. దాదాపు 5 కిలో మీటర్ల మేర ఈ ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. వానకాలంలో ఘాట్స్‌ పరిసర అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

ప్ర‌పంచ‌ఖ్యాతి గాంచిన కొయ్య‌బొమ్మ‌లు..

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్య బొమ్మల తయారీ కేంద్రానికి నెలవు నిర్మల్‌ ప్రాంతం. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో తయారైన కొయ్యబొమ్మలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పొనికి కర్రతో తయారు చేసిన కొయ్యబొమ్మలు జీవం ఉట్టిపడేలా ఉంటాయి. అందుకే వీటిని విదేశీయులు సైతం ఇష్టపడతారు.


న‌ల్ల‌బంగారు నేల‌.. సింగ‌రేణి..

మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్‌, సీసీసీ, ఇందారం, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలో సింగరేణి విస్తరించి ఉంది. ఓసీలతో పాటు భూగర్భ గనుల ద్వారా బొగ్గును వెలికితీస్తుండగా, పెద్ద సంఖ్యలో కార్మికులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలో నిర్మించిన సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వెలుగులను అందిస్తున్నది. 


VIDEOS

logo