మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:45:57

స్వస్థలాలకు 153 మంది గల్ఫ్‌ కార్మికులు

స్వస్థలాలకు 153 మంది గల్ఫ్‌ కార్మికులు

  • ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసిన మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బహ్రెయిన్‌ దేశం నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన గల్ఫ్‌కార్మికులు క్వారంటైన్‌ ముగియడంతో స్వస్థలాలకు బయలుదేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో 153 మంది కార్మికులు శనివారం హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాకు పయనమయ్యారు. బహ్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ వలస కార్మికులను ఇక్కడకు తీసుకొచ్చేందుకు ఇండియన్‌ క్లబ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటుచేసింది. గతనెల 27న కార్మికులు హైదరాబాద్‌కు చేరుకోగా, ఎన్టీఆర్‌ స్టేడియంలో వారంపాటు ప్రభుత్వ ఉచిత క్వారంటైన్‌ లో ఉన్నారు. క్వారంటైన్‌ ముగియడంతో స్వస్థలాలకు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి గల్ఫ్‌ అధ్యక్షుడు చెల్లంశెట్టి హరిప్రసాద్‌, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి సమన్వయం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవితకు గల్ఫ్‌కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అల్లోల చొరవతో స్వస్థలాలకు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా బెలారస్‌లో చిక్కుకున్న 10 మంది తెలంగాణ వైద్య విద్యార్థులు శుక్రవారం ఢిల్లీకి చేరుకోగా.. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి లేఖతో తమ స్వస్థలాలకు పంపేందుకు అక్కడి అధికారులు అనుమతించారు. నిర్మల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, సూ ర్యాపేట, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన విద్యార్థులు బెలారస్‌ నుంచి శుక్రవారం ఢిల్లీకి చేరుకోగా అక్కడి అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. మంత్రి చొరవ తో వారు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు.


logo