బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 20:10:11

ఐటీశాఖ ప్రగతి నివేదిక విడుదల

ఐటీశాఖ ప్రగతి నివేదిక విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీశాఖ ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం విడుదల చేశారు. గత ఐదేళ్లుగా ప్రగతి నివేదిక విడుదల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆరోసారి ఐటీ ప్రగతి నివేదిక(2019-20)ను మంత్రి ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. జాతీయ సగటు ఐటీ ఎగుమతుల కన్నా ఎక్కువగా తెలంగాణ ఐటీ రంగం పురోగతి సాధించిందని తెలిపారు. జాతీయ సగటు 8.09 శాతంతో పోల్చితే దానికి రెండింతలు 17.97 శాతంతో తెలంగాణ ఐటీ, ఐటీ సంబంధిత ఎగుమతులు ఉన్నాయన్నారు. 

ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విజయవంతం...

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని తీసుకెళ్లాలన్న తమ ప్రయత్నం విజయవంతమైందన్నారు. వరంగల్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు టెక్‌ మహీంద్రా, సైయంట్‌ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి ఐటీ రంగంలో పలు భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్‌ తన అతిపెద్ద రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించాయన్నారు. కరోనా సంక్షోభంలో ఐటీశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రోగుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, వారి కదలికలు, హోమ్‌ క్వారంటైన్‌ వాలంటీరింగ్‌ వంటి అంశాల్లో ఇతర శాఖలకు ఐటీశాఖ సహకరించిందన్నారు. ప్రస్తుత సంక్షోభం సందర్భంగా పలు డిజిటల్‌ సొల్యూషన్లు అందించినట్లు తెలిపారు. 

పెరిగిన ఎగుమతులు, ఉపాధి కల్పన...

గత ఏడాదితో పోలిస్తే దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 నుంచి 11.58కి పెరిగిందన్నారు. అదేవిధంగా జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ 7.2 శాతంగా నమోదు అయిందన్నారు. జాతీయ సగటు 4.93 శాతంగా ఉందన్నారు. టీయాప్‌ ఫోలియో 7 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌ అయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిజిటల్‌ వాలెట్‌ ద్వారా 11 లక్షలకు పైగా యాక్టివ్‌ రిజిస్ట్రేషన్లను కలిగి ఉందన్నారు. దీని ద్వారా రూ.6,795 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నారు. ఫేస్‌బుక్‌, యూటీసీ, బోయింగ్‌ వంటి అనేక కంపెనీలతో కలిసి టీహబ్‌ కార్పొరేట్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.  టాస్క్‌ ద్వారా ఇప్పటి వరకు 3.50 లక్షల యువకులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. 4,500 మంది విద్యార్థులు నేరుగా ఉద్యోగాల్లో చేరారన్నారు.


logo