గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:49:24

ఏఐలో తెలంగాణకు సాటిలేదు

ఏఐలో తెలంగాణకు సాటిలేదు

  • మంత్రి కే తారకరామారావుతో 
  • కలిసి పనిచేయడం అద్భుతం
  • నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌
  • ఏఐ వినియోగానికి ఇదే సరైన టైం
  • సామాన్యుడికి పనికిరాని మేధ వృథా 
  • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రపథాన దూసుకుపోతున్నదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ప్రశంసించారు. ఏఐలో ప్రయోగాత్మక విధానంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ఏఐని మొదటగా అమలుచేయడానికి తెలంగాణ కంటే మంచి రాష్ట్రం దేశంలోనే లేదని, మంత్రి కేటీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉన్నదని వివరించారు. బుధవారం ప్రగతిభవన్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ ఇన్నోవేషన్‌ (ఏఐ4ఏఐ) ఇన్‌ కొలాబిరేషన్‌ విత్‌ సెంటర్‌ ఫర్‌ ది ఫోర్త్‌ ఇండస్ట్రీయల్‌ రెవెల్యూషన్‌ (సీ4ఐఆర్‌)లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కీలకోపన్యాసం చేయగా.. అమితాబ్‌కాంత్‌ ప్రసంగించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం (సీ4ఐఆర్‌), ప్రపంచ వాణిజ్య వేదికలు రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం, ఐటీశాఖ సంయుక్తంగా ఏఐ వినియోగంపై అధ్యయనం చేస్తున్నాయని అమితాబ్‌కాంత్‌పేర్కొన్నారు. ఏఐ వినియోగం ద్వారా రైతులు ఎంతవరకు లబ్ధిపోందుతున్నారనే అంశాన్ని పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఐప్లెయ్డ్‌ను ఆవిష్కరించారు. ఇందులో త్రిపుల్‌ ఐటీ, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వాములుగా పనిచేయనున్నాయి.

సాగులో డిజిటల్‌ టెక్నాలజీ

తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశాల్లో వ్యవసాయం ఒకటని, ఈ రంగంలో డిజిటల్‌ టెక్నాలజీని వినియోగించడానికి ఇదే సరైన సమయమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తన కీలకోపన్యాసంలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2020ని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలను ఇందులో భాగస్వాములను చేశామని వివరించారు. దీనిద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చనే తమ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ స్ట్రాటజీ కోసం ఆరు విభాగాలు ఏర్పాటుచేశామన్నారు. ఏఐలో తెలంగాణను ప్రపంచంలోనే హబ్‌గా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. దీనిద్వారా తెలంగాణ ఏఐ మిషన్‌ను ఆవిష్కరించామని పేర్కొన్నారు.

నాస్కామ్‌ భాగస్వామ్యంతో ప్రత్యేకమైన సంస్థను దీనికోసం ఏర్పాటుచేశామని చెప్పారు. సామాన్యుడికి ఉపయోగపడని ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా వృథాయేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎమర్జింగ్‌ టెక్నాలజీని వాడుతున్నదని చెప్పారు. వ్యవసాయరంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కీలకమైన మార్పు లు తీసుకొస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఇందులో ప్రభుత్వంతోపాటు ఇతరులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వంటి సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సలహాదారు జే సత్యనారాయణ, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఎండీ మురాత్‌, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్‌ సెక్రటరీ వివేక్‌ అగర్వాల్‌, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ కార్యదర్శి అజయ్‌ సహాని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo