బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 01:55:19

ఈ-ఆడిట్‌లో ఆదర్శం

ఈ-ఆడిట్‌లో ఆదర్శం

  • ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ అమలుచేస్తున్న ఒకేరాష్ట్రం తెలంగాణ
  • ప్రశంసలు కురిపించిన కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ
  • 13న అన్నిరాష్ర్టాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ 
  • ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న తెలంగాణ బృందం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రశంసించింది. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నది. రాష్ర్టాల్లోని కనీసం 20 శాతం గ్రామపంచాయతీల్లో ఈ-ఆడిటింగ్‌ చేపట్టాలని కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. 15వ ఆర్థికసంఘం ప్రతిపాదించిన నిధులను పంచాయతీల అకౌంట్లలో జమచేయాలంటే ఈ-ఆడిట్‌ను అమలు చేయాల్సిందేనని నిబంధన పెట్టింది. ఈ నెల 3 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. అయితే తెలంగాణ మాత్రమే ఈ-ఆడిట్‌ను మొదలుపెట్టింది. ఇతర రాష్ర్టాలు ఈ-ఆడిట్‌ను చేపట్టకపోవడంపై కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అసంతృప్తి వ్యక్తంచేసింది. 

ఈ నెల 13న అన్నిరాష్ర్టాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయిస్తూ.. లేఖలు రాసింది. ఈ-ఆడిట్‌లో తెలంగాణ అందరికన్నా ముందున్నదని లేఖలో ప్రశంసించిన కేంద్రం.. 13న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ-ఆడిట్‌ అమలు తీరుతెన్నులను వివరించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ తరఫున ‘లోకల్‌ ఫండ్‌ ఆడిటింగ్‌' విభాగం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నది. ఈ సమావేశానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్‌ సేథి అధ్యక్షత వహిస్తారు. 

కేంద్రం లక్ష్యానికి మించి.. 

తెలంగాణలోని 3,830 పంచాయతీల్లో ఈ నెల 3న ఈ-ఆడిట్‌ మొదలయింది. 336 మంది ఆడిటర్లు ఇందులో పాల్గొంటున్నారు. అక్టోబర్‌ నెలాఖరువరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఎంపికచేసిన పంచాయతీలు తమ ఆదాయవ్యయాలు, జమాఖర్చుల నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. కేంద్రం కనీసం 20 శాతం పంచాయతీల్లో ఈ- ఆడిట్‌ చేయాలని సూచించగా.. తెలంగాణ ఆ లక్ష్యాన్ని మించి 30 శాతం గ్రామాల్లో ఈ ప్రక్రియను చేపట్టింది.

రికార్డు సమయంలో పూర్తి 

ఈ-ఆడిట్‌ ప్రక్రియకు తెలంగాణ రికార్డు సమయంలో సిద్ధమయింది. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఏప్రిల్‌ నెలాఖరులో అన్ని రాష్ర్టాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ‘ఆడిట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌'పై వివరించింది. ఇందులోభాగంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎంపికచేసిన అధికారులకు యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు సృష్టించాల్సి ఉంటుంది. పంచాయతీ ఆదాయవ్యయాలను ఆన్‌లైన్‌లో ఎలా నమోదుచేయాలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర ఆడిటింగ్‌ విభాగం నెలలోపే పూర్తి చేయడం విశేషం.

2022 నాటికి అన్నిగ్రామాల్లో ఈ-ఆడిట్‌ 


పంచాయతీల పాలనలో పాదర్శకతను పెంపొందించేందుకు ఈ-ఆడిట్‌ ఉపయోగపడుతుంది. 12,769 పంచాయతీలకుగానూ 3,830 గ్రామాల్లో అంటే 30 శాతం పంచాయతీల్లో ఈ ఏడాది ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ చేపట్టాం. ప్రాజెక్టు పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నాం. 2022 నాటికి రాష్ట్రంలోని 100 శాతం గ్రామాల్లో ఈ-ఆడిట్‌ చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. వచ్చేఏడాది మరో 30 నుంచి 40 శాతం గ్రామాల్లో అమలుచేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాం.

- మార్తినేని వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర ఆడిట్‌శాఖ డైరెక్టర్‌


logo