గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 23:10:57

భిన్నపార్శాల డైనమిజం

భిన్నపార్శాల డైనమిజం

ప్రత్యేక ఉనికితో ఆవిర్భావానికే అర్హత లేదన్న తెలంగాణ, నేడు పదహారు వివిధరంగాల్లో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించి ఆసేతుహిమాచలం ఆసక్తిగా గమనించేట్లుగా దూసుకుపోతున్నది. ఈ అభివృద్ధి, వికాసాలకు ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ భవిష్యత్‌ దర్శనం ఒకటైతే, అతనికి తోడుగా యువనేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అవిరళ కృషి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆధునిక ప్రపంచానికి ప్రతినిధి అయిన కేటీఆర్‌ 44వ పుట్టినరోజు నేడు (జూలై 24న). కేటీఆర్‌ రాజకీయ ప్రవేశాన్ని వారసత్వంతో ముడిపెట్టి విమర్శలు వచ్చినా.., తనదైన సమ్మోహనాత్మక నాయకత్వ లక్షణాలతో అందరి మెప్పు పొందుతున్నారు. సమర్థుడైన పాలనాదక్షుడిగా, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి కష్టాల కన్నీళ్లు తుడిచే నేతగా కేటీఆర్‌ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) మొదటి రాజకీయ స్పర్శనే అందరినీ అబ్బురపరిచింది. 2007లో మాజీ ప్రధాని దేవేగౌడ మైసూర్‌లో ఏర్పాటుచే సిన ర్యాలీలో కేసీఆర్‌ గైర్హాజరీలో పాల్గొనాల్సి వచ్చింది. ఆ సభలో కేటీఆర్‌ తన మొదటి ప్రసంగంలోనే తనదైన వాగ్ధాటితో జాతీయ నేతలను ముగ్ధులను చేశారు. కేటీఆర్‌ ప్రసంగం విన్న తర్వాత.. ‘విమర్శ వస్తుందని సందేహించవద్దు, ఆ అబ్బాయిలో స్పార్క్‌ ఉంది, ‘హీ విల్‌ బికమ్‌ ఏ వెరీ గుడ్‌ లీడర్‌' అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే, ‘మిస్టర్‌ రావ్‌, ఐ విల్‌ ఫైట్‌ విత్‌ యూ ఇఫ్‌ యూ ఓంట్‌ బ్రింగ్‌ హిమ్‌ టు లోక్‌సభ’ అని దేవేగౌడ వ్యాఖ్యానించారట. ‘ఇఫెటాల్‌ యూ ఆర్‌ గివింగ్‌ హిమ్‌ ఆన్‌ ఆపార్చునిటీ, డోన్ట్‌ మినిమైజ్‌ హిమ్‌ టు స్టేట్‌ అసెంబ్లీ, బ్రింగ్‌ హిమ్‌ టు లోక్‌ సభ’అని ప్రకాష్‌కారత్‌, బర్దన్‌ అన్నారట. 

సభలో సంక్లిష్టమైన సంకీర్ణ రాజకీయాల సంధికాలంలో వర్తమాన రాజకీయ వ్యవహారాలపై అవగాహన, భాషా నైపుణ్యాలతో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2014 జూన్‌ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే ‘విదేశీ పెట్టుబడుల సాధనే లక్ష్యం’గా మధ్య ప్రాచ్యంలోని దుబాయ్‌తో ప్రారంభించి అమెరికా మొదలు పాశ్చాత్య దేశాలన్నింటా పర్యటించారు. అభివృద్ధి పట్ల ఆయన దృక్పథం, నిర్ణయీకరణ వేగం, ప్రాపంచిక అవగాహన, అత్యుత్తమమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెట్టుబడిదారులను ఆకర్షించాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేటీఆర్‌ తనదైన మార్క్‌ చూపుతున్నారు.

హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ వాటర్‌ వర్క్స్‌ ద్వారా  శివార్లలో లక్ష  ఆవాసాలకు నీళ్లు ఇవ్వడానికి 18 నెలల సమయాన్ని కేటాయిస్తే, 13 నెలల్లోనే పూర్తిచేశారు. వ్యూహాత్మక (ఎస్‌ఆర్‌డీపీ) రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఎన్నింటినో గడువుకు ముందే పూర్తిచేయడం ఆయన పనితీరుకు     నిదర్శనం.  ‘జ్ఞానికి అనుభవం అవసరం లేదు, ఆలోచనతోనే  తత్త్వాన్ని గ్రహిస్తాడ’ని సామెత. నేడు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దటంలో కేటీఆర్‌ దూరదృష్టి, ప్రణాళికాబద్ధ పని విధానం ప్రధాన భూమిక. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’ కార్యక్రమంలో నిర్వహించిన  పరిచయ కార్యక్రమంలో ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు, బరువుల గురించి ప్రశ్నిస్తూ.. మీరు ఎప్పుడు నిద్రపోతారన్న ప్రయోక్త ప్రశ్నకు.. కేటీఆర్‌ జవాబు- ‘నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను’అని. పాల నాలక్ష్యాలు సాధించాలంటే ప్రజా భాగస్వామ్యం ఎంత అవసరమో బాగా తెలిసిన సృజనాత్మక నాయకుడు కేటీఆర్‌.

తెలంగాణ ఆత్మ  కేసీఆర్‌కు తెలుసన్నది జనసామాన్యపు  భావన.  తెలంగాణ ఆత్మగురించి అంతే  లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు,  21వ శతాబ్దపు ఆధునిక  పాలనా వ్యూహాలను కలిగి ఉన్న నిపుణుడు కేటీఆర్‌. కష్టించి పనిచేసే స్వభావం, హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌ వర్క్‌ల అత్యుత్తమ సమ్మేళనంగా కేటీఆర్‌ను చెప్పవచ్చు.

సీహెచ్‌. దినేష్‌ కుమార్‌


logo