శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 02:56:09

తెలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు

తెలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు

  • ప్రపంచ యవనికపై పుట్టపాక ప్రతిభ
  • తెలంగాణ చేనేత సిగలో మణిహారం
  • ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అద్భుత పని నైపుణ్యంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన చరిత్ర తెలంగాణ చేనేతది. తాజాగా రాష్ట్ర చేనేత సిగలో మరో మణిహారం చేరింది. యాదాద్రిభువనగిరి జిల్లా పుట్టపాకలో తయారయ్యే తెలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు(జీఐ) లభించింది. పుట్టపాక గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డుగ్రహీత గజం గోవర్ధన్‌ 1975 నుంచి తెలియారుమాల్‌కు ప్రచారం కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఫ్రాన్స్‌, అమెరికా, జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌ తదితర దేశాల్లో ప్రదర్శనలు కూడా నిర్వహించారు. పుట్టపాక చేనేత క్లస్టర్‌ తరుఫున  రెండేండ్ల క్రితం జీఐ ట్యాగింగ్‌ కోసం దరఖాస్తు చేశారు. వివిధ దశల్లో పరిశీలన అనంతరం జీఐ అధికారులు ఈనెల 10న తెలియారుమాల్‌కు భౌగోళిక గుర్తింపు ఇచ్చారు.  

అద్భుత నైపుణ్యానికి ప్రతీక 

తెలియా అంటే నూనే అని అర్ధం. తెలియా రుమాల్‌ అనేది అరుదైన చేనేత వస్త్రం. చమురు పూసిన దారంతో రుమాల్‌ను తయారుచేస్తారు. ఎలాంటి రసాయనాలు వా డకుండా సహజరంగులు మాత్రమే ఉపయోగిస్తారు. ఎరుపు, నలుపు, తెలుపురంగులు కలగలిసి ఉండే ఈ రుమాల్‌ను ధరిస్తే వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటం విశే షం. కొన్ని దశాబ్దాల క్రితంవరకు దీనిని విరివిగా ఉపయోగించేవారు. ఆధునిక పోకడల కారణంగా రుమాల్‌కు ఆదరణ తగ్గటంతో అదే ముడిసరుకుతో దోవతి, చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌ తదితర వస్త్రాలను తయారు చేస్తున్నారు. 

జీఐ ట్యాగ్‌తో అనేక లాభాలు

భౌగోళిక గుర్తింపుతో తెలియా రుమాల్‌కు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభించనుంది. ప్రపం చ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో ఈ గుర్తింపు ఇస్తారు. ఆ సంస్థ రూపొందించిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌(రిజిస్ట్రేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) యాక్ట్‌,1999 ఆధారంగా ఈ గుర్తింపు లభిస్తుంది. డబ్ల్యూటీవోలో భారత్‌ సభ్య త్వం తీసుకోవటంతో 2003 సెప్టెంబర్‌ 15 నుంచి ఈ చట్టం మనదేశంలో కూడా అమల్లోకి వచ్చింది. ట్రేడ్‌ రిలేటెడ్‌ యాస్పెక్ట్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (ట్రిప్స్‌)లోని ఆర్టికల్‌ 22(1) జీఐ గుర్తింపు ఇస్తారు. ఒక ప్రత్యేకంగా భౌగోళిక ప్రాంతంలో మాత్రమే తయారయ్యే వస్తువులకు ఈ గుర్తింపు లభిస్తుంది.  దీనితో ఒక భౌగోళిక ప్రాంతంలో మాత్రమే అధికారికంగా ఈ వస్తువును ఉత్పత్తి చేస్తారనే హక్కులు జీఐ గుర్తింపుతో లభిస్తాయి. 


logo