బుధవారం 27 జనవరి 2021
Telangana - Oct 31, 2020 , 02:15:04

అభాగ్యులకు అండ

అభాగ్యులకు అండ

  • దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
  • తొమ్మిదిరకాల సామాజిక పింఛన్లు పంపిణీ 
  • వికలాంగులకు 3,016.. ఇతర అభాగ్యులకు 2,016
  • ఏటా 11 వేల కోట్లు వెచ్చిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • కేంద్రం వాటా 1.90 శాతం మాత్రమే 
  • బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అందించేది అరకొరే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘అభాగ్యులకు అందించే పింఛన్‌ ముష్టివేసినట్టు ఉండొద్దు. వాళ్లు ఎవరి ముందూ చేయిచాచకుండా ఆత్మగౌరవంతో బతికేలా ఉం డాలి’ అనేలా తెలంగాణలో సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం మొత్తం తొమ్మిది రకాల పింఛన్లు ఇవ్వడమే కాకుండా.. దేశంలోనే అత్యధిక పింఛన్‌ సొమ్మును పింఛన్‌దారులకు అందజేస్తున్నది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.11వేల కోట్లు వెచ్చిస్తున్నది. ఇందులో కేంద్రప్రభుత్వం నుంచి అందేది రూ.210 కోట్లు (1.90శాతం) మాత్రమే. ‘ఇచ్చేది కూనంత.. కూసేది కొండత’ అన్నట్టు రాష్ట్రంలో పింఛన్‌దారులకు పంపిణీ చేస్తున్న పింఛన్‌ సొమ్మంతా కేంద్రమే ఇస్తున్నట్టు బీజేపీ నేతలు గొప్పలు పోతున్నారు. పింఛన్ల నిధులన్నీ కేంద్రప్రభుత్వమే ఇస్తే.. మరి తెలంగాణలో పంపిణీ చేస్తున్నట్టుగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకివ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో వికలాంగులకు రూ.3016, ఇతర పింఛన్లు రూ.2016 ఇస్తుంటే.. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ రూ.600 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు.

పింఛన్‌దారులు 38,40,712 మంది

వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, పైలేరియా వ్యాధిగ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం పింఛన్లను అందజేస్తున్నది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో పింఛన్ల కింద నెలకు రూ.75 ఇచ్చేవారు. అదీ.. నెలల తరబడి పడిగాపులు కాస్తేకానీ అందేవికావు. గ్రామాల్లో పింఛన్‌దారు చనిపోతేనే అతడి స్థానంలో మరొకరికి పింఛన్‌ ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. కాంగ్రెస్‌ హయాంలో నెలకు రూ.200 ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే మొత్తాన్ని అదేరీతిన పింఛన్ల కింద అందజేసేవారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అధికారంలోకి రాకముందునుంచే సామాజికపింఛన్లపై మానవీయ దృక్పథాన్ని కనబర్చారు. సామాజిక పింఛన్లనేవి ప్రభుత్వాలకు బరువు కాదు.. బాధ్యత అని పేర్కొంటూ నెలకు రూ.1000 పింఛన్‌ ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చెప్పినట్టుగానే వృద్ధ్దాప్య, వికలాంగ, వితంతు పింఛన్లను అదజేసిన సీఎం కేసీఆర్‌.. ఆపై సమాజంలోని అన్నిరకాల అభాగ్యులను గుర్తించి వారికి కూడా సామాజికభద్రత కల్పించారు. ప్రస్తుతం తెలంగాణలో 38,40,712 మందికి తొమ్మిది రకాల సామాజిక పింఛన్లను అందజేస్తున్నారు.

ఇచ్చేదెంత? చెప్పుకునేదెంత??

రాష్ట్రంలో తొమ్మిది రకాల సామాజిక పింఛన్లను అందజేస్తుంటే.. బీజేపీ నేతలు దీనిని కేంద్రప్రభుత్వం ఖాతాలో వేసే నీచ రాజకీయానికి పాల్పడుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో నిస్సిగ్గుగా సామాజికపింఛన్ల మొత్తాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఇస్తున్నదంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో తొమ్మిదిరకాల పింఛన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.11వేలు కోట్లు ఇస్తున్నది. ఇందులో కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చేది రూ.210 కోట్లు. అంటే 1.9 శాతం మాత్రమే కేంద్రం నుంచి అందుతున్నది. రూ.10,790 కోట్లు తెలంగాణ ప్రభుత్వమే ఇస్తున్నది. గింతముక్క ఇస్తున్నోళ్లు అంత ప్రచారం చేసుకుంటుంటే.. రొట్టె మొత్తం ఇస్తున్నోళ్లు ఎంత ప్రచారం చేసుకోవాలె. రాష్ట్రంలో తొమ్మిది రకాల పింఛన్ల లబ్ధిదారులు 38,40,712 మంది ఉంటే ఇందులో వృద్ధ్దాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు అందుకుంటున్నవారు 31,37,119 మంది ఉన్నారు. వీరిలో రూ.6,16,000 మందికి (19.63 శాతం) మాత్రమే కేంద్రం కొంత మొత్తాన్ని ఇస్తున్నది. వృద్ధాప్య పింఛన్ల కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2,016 ఇస్తే.. అందులో కేంద్రం ఇచ్చేది రూ.200. వితంతువులకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 ఇస్తుంటే వాటిలో కేంద్రం వాటా రూ.300 మాత్రమే. 

దరిదాపుల్లోలేని ఇతర రాష్ట్రాలు

సామాజిక పింఛన్ల పంపిణీ తీరులో దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదు. బీజేపీపాలిత రాష్ట్రాల్లోనూ పింఛన్లు అరకొరగా అందిస్తున్నారు. తెలంగాణలో తొమ్మిది రకాల పింఛన్లు ఇస్తుండగా.. కేంద్రం వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లకు మాత్రమే కొద్దిమొత్తం నిధులు ఇస్తున్నది. ఒక్క కర్ణాటకలో అదనంగా చేనేత పింఛన్లు ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీడీ, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, పైలేరియా రోగులను కూడా గుర్తించి వారికి పింఛన్లు అందజేస్తున్నది. ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

  


logo