ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:59:34

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ బెస్ట్‌

 కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ బెస్ట్‌

  • ఫిక్కీ, ఆస్కి, ఎఫ్‌టీసీసీఐ పరిశీలనలో వెల్లడి
  • పండుగలు, చలికాలంలో కేసులు పెరుగవచ్చని హెచ్చరిక
  • వైరస్‌ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు
  • ఐదు దక్షిణాది రాష్ర్టాలలో ఉత్తమ పనితీరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని ప్రశంసించాయి. ‘తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్‌ కార్యాచరణ ప్రణాళిక సిఫారసులు-2వ దశ’ పేరిట ఈ మూడు సంస్థలు ఒక సంయుక్త నివేదికను విడుదలచేశాయి. వైరస్‌ వేగంగా విస్తరించకుండా అరికట్టడంలో తెలంగాణ సఫలమైందని తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ, హోం క్వారంటైన్‌ను ప్రోత్సహిస్తూ, రాష్ట్రంలో మరణాల సంఖ్యను కూడా గణనీయం గా తగ్గించగలిగిందని ప్రశంసించాయి.  ఆరోగ్య విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమించ డం, టీఎస్‌ఎంహెచ్‌ఐడీసీ ద్వారా వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ బెడ్స్‌, పీపీఈ కిట్స్‌ వంటి వైద్య పరికరాలు సమకూర్చుకోవటం మంచి ఫలితాలను ఇచ్చినట్లు పేర్కొన్నాయి. కొవిడ్‌ కేర్‌సెంటర్ల ఏర్పాటు, హోం క్వారెంటైన్‌ను ప్రోత్సహించడం, పెద్ద దవాఖాల్లో వైద్య సేవలు, బస్తీ దవాఖానల వేళల పెంపు, 108 అంబులెన్సుల పనితీరు, టెలి మెడిసిన్‌ కేంద్రాల ఏర్పాటు, వైద్య పరికరాలను సమకూర్చుకోవటం, హోం ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ, అధిక ధరల వసూలుపై ప్రైవేటు దవాఖానలను బ్లాక్‌ లిస్టులో పెట్టడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయని వెల్లడించాయి. 

ముప్పు తొలగిపోలేదు

జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో కేసుల పెరుగుదల వృద్ధి తక్కువగా నమోదైందని, అయితే పూర్తిగా ప్రమాదం తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. పండుగల వేళ, చలికాలం నేపథ్యంలో కరోనా రెండోదశ వచ్చే అవకాశం ఉన్నట్టు హెచ్చరించాయి. అందుకే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, పరిశుభ్రంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆస్కి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శాశ్వత్‌ కిశోర్‌ మిశ్రా సూచించారు. ఈ ఏడాది చివరినాటికి కేసుల సంఖ్య మరోసారి స్వల్పంగా పెరిగే అవకాశముందని తెలిపారు. వైద్య నిపుణులు, పౌరులు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కృషి వల్లనే తెలంగాణ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనగలుగుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ మూడు సంస్థలు కొన్ని సూచనలు చేశాయి. వైద్య ఆరోగ్య రంగంలో సిబ్బంది సంఖ్యను పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించాయి. అన్ని జిల్లాలకు టెలి మెడిసన్‌ను విస్తరించాలని, నిర్దిష్ట ధరలకు ఔషధాలను విక్రయించేందుకు కొవిడ్‌ మెడికల్‌షాప్‌లను ఏర్పాటుచేయాలని తెలిపాయి. 

పడకలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఖాళీ

దాదాపు ఏడు నెలలపాటు కంటి మీద కునుకు లేకుండాచేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నది. గడిచిన నెలన్నర నుంచి కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో తగ్గుముఖం పడుతున్నది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కరోనా కోసం కేటాయించిన పడకలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా రోగుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో 8,794 పడకలు కేటాయించగా, వాటిలో 7,196 పడకలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం 33 జిల్లాల్లోని 8,114 సెంటర్లలో సగం కంటే తక్కువ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. పాజిటివ్‌ వచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రమా దం పూర్తిగా తొలిగిపోలేదని హెచ్చరిస్తున్నారు. కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో వైరస్‌ రెండోవిడుత విజృంభించిన ఘటనలు ఉన్నాయని, అక్కడి ప్రజల అజాగ్రత్త వల్లే అలా జరిగిందని చెప్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం, పరిశుభ్రతను పాటించడం మరచిపోవద్దని హెచ్చరిస్తున్నారు.

వైరస్‌ వేగంగా విస్తరించకుండా అరికట్టడంలో తెలంగాణ సఫలమైంది. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. వైద్య నిపుణులు, పౌరులు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కృషి వల్లనే ఇది సాధ్యమైంది. జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో కేసుల వృద్ధి తగ్గుతున్నది. అయితే ముప్పు ఇంకా తొలగిపోలేదు. పండుగల వేళ, చలికాలం నేపథ్యంలో కరోనా రెండోదశ వచ్చే అవకాశం ఉంది.

- ఫిక్కీ, ఆస్కి, ఎఫ్‌టీసీసీఐ

మంత్రి కేటీఆర్‌ అభినందన

కరోనాను అరికట్టడంలో దక్షిణాది రాష్ర్టాలలో తెలంగాణ బెస్‌ అంటూ ఫిక్కీ తదితర సంస్థలు ప్రశంసించడంపై మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన వైద్యారోగ్యశాఖను అభినందించారు. కరోనాపై పోరులో ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది ముందుండి పోరాడారని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు, ఆయన నేతృత్వంలోని మొత్తం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. 


logo