ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 12:40:30

నవశకానికి నాంది పలుకనున్న తెలంగాణ : మంత్రి పువ్వాడ

నవశకానికి నాంది పలుకనున్న తెలంగాణ : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్రంలో అరుదైన చరిత్ర ఆవిష్కృతం కాబోతున్నదని, ఈ వానాకాలం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామంలోని లంకా సాగర్ చెరువు నుంచి సాగునీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ..జిల్లాలోని ప్రతి ఎకరా సాగులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు పంటలకు  పుష్కలంగా సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. సీతారామ జిల్లాకు వరప్రదాయని అని పేర్కొన్నారు.

కొత్త ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి రావడంతో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నదని, ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు, వాటిలో ఉన్న నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేస్తే... ఈ విషయం అర్థమవుతుందని  పేర్కొన్నారు. 


భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత వానాకాలంలో ఏకంగా 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేదని అన్నారు.  2014-15 సంవత్సరంలో తెలంగాణలో వానాకాలం పంటకు కేవలం 9,73,072 ఎకరాలకు నీరు అందితే, నేడు అది 41,00,000 ఎకరాలకు చేరుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎట్లా పచ్చబడ్డదో నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు.
logo