శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:38:44

నరేగాలో నంబర్‌వన్‌

నరేగాలో నంబర్‌వన్‌

  • 75.5 శాతం లక్ష్య సాధన
  • 9.81 కోట్ల పనిదినాల కల్పన
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. 2020-21 సంవత్సరంలో రాష్ర్టానికి 13 కోట్ల పని దినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తిచేసి కూలీలకు ఉపాధి కల్పించామని చెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్లు అధికారుల సమావేశంలో  సీఎం మాట్లాడుతూ.. నరేగాను సమర్థంగా వినియోగించుకోవడం వల్ల లక్షల మందికి ఉపాధి దొరికిందని చెప్పారు. ‘ఇంత పెద్దఎత్తున దేశంలో మరెక్కడా పనులు జరుగలేదు. 53.5% తో ఛత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో ఉన్నది. దేశ సగటు 26.3 శాతం మాత్రమే ఉన్నది. తెలంగాణలో నరేగా పనులను సమర్థంగా నిర్వహించిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఆ శాఖ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు అభినందనలు. నరేగాను మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలి. మన కూలీలకు ఎక్కువ పని కల్పించాలి. మన రాష్ట్రంలో ఎక్కువ పనులు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే పనులు జరుగాలి. 

ఆ విధంగా ప్రణాళికలు తయారుచేయాలి. నర్సరీలు, మొక్కల పెంపకం పనులు, అన్నిరకాల రోడ్ల వెంట చెట్లు, పొదల తొలిగింపు పనులు, కాల్వల్లో, చెరువు కట్టలపై చెట్ల తొలిగింపు పనులు, కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు, వైకుంఠధామాల నిర్మాణం, డంప్‌యార్డుల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, మురుగునీరు, నిల్వ ఉన్న నీటి తొలిగింపు పనులు, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కల్లాల నిర్మాణం, వ్యవసాయ భూమిని చదును చేసుకొనే పనులు, పంటచేలకు పశువులు రాకుండా ట్రెంచ్‌ నిర్మాణం, ఇంకుడుగుంతల ఏర్పాటు, గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్ల నిర్మాణం, వర్మికంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాడుబడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడికతీత పనులు తదితర ప్రజోపయోగ పనులను నరేగా ద్వారా చేపట్టాలి’ అని సీఎం చెప్పారు. 

నరేగా ఇంజినీర్స్‌ ఆఫీసర్స్‌ ఏర్పాటు

ఈసారి ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల లాంటి ఇంజినీరింగ్‌శాఖలతోపాటు ఇతర ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజినీరింగ్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఈవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు.  నరేగా ముఖ్య ఉద్దేశమే కూలీలకు ఉపాధి కల్పించడం కాబట్టి కూలీలకు చాలా తొందరగా డబ్బులు వచ్చేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.  


logo