శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:30:59

దేశానికి తెలంగాణ బువ్వ

దేశానికి తెలంగాణ బువ్వ

  • 165 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా
  • ఈ ఏడాది పంజాబ్‌ను వెనక్కినెట్టేలా అడుగులు
  • ఎఫ్‌సీఐ బియ్యం సేకరణలో మనదే మెజారిటీ
  • ఐదేండ్లలోనే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ
  • ధాన్యం కొనుగోలులో నంబర్‌వన్‌ దిశగా రాష్ట్రం 

ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు నీటికి.. బుక్కెడు బువ్వకేడ్చిన తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నదాతగా ఎదిగాడు. వరి సాగు, దిగుబడుల్లో రికార్డులను సృష్టిస్తూ.. ధాన్యం కొనుగోళ్లలో సత్తా చాటుతూ తెలంగాణ అన్నపూర్ణగా మారింది. దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రం దిశగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ, రైతు కేంద్రీకృత పథకాలు ఐదేండ్లలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాయి. ఒకప్పుడు  నెర్రెలుబారిన నేలల్లో ఇప్పుడు పసిడి పంటలు పండుతున్నాయంటే సంక్షేమ పథకాల ఫలితమనేది సుస్పష్టం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నది. 2020-21 సంవత్సరంలో 165 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా.. పంజాబ్‌ను వెనక్కు నెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. వానకాలంలో 90 లక్షలు, యాసంగిలో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అంచనాలు సిద్ధంచేసింది. 2019-20లో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలంగాణ నుంచి 111.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 162.33 లక్షల టన్నులతో పంజాబ్‌ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. 81.53 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్‌ తర్వాత స్థానంలో ఉన్నది. తెలంగాణలో ఈ వానకాలం సీజన్‌లో భారీస్థాయిలో 52.55 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా.. సాగు విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. యాసంగిలోనూ వరి జోరు కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీస్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఈ ఏడాది పంజాబ్‌లో 0.39 శాతం మాత్రమే వరి విస్తీర్ణం పెరుగడంతో ధాన్యం దిగుబడి గతేడాది మాదిరిగానే వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణలో మాత్రం పెరిగిన విస్తీర్ణం మేరకు పంట ఉత్పత్తి పెరుగనున్నది. ఈ నేపథ్యంలో గతేడాది పంజాబ్‌ ధాన్యం కొనుగోళ్లు 162.33 లక్షల టన్నులతో పోల్చితే తెలంగాణలో ఈసారి 165 లక్షల టన్నులకుపైగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉన్నది. దీంతో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 

దేశానికి మన బియ్యమే

దేశవ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించేందుకు ఎఫ్‌సీఐ బియ్యం సేకరించే రాష్ర్టాల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉన్నది. 2019-20లో తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐ 74.54 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది. పంజాబ్‌ నుంచి 108.76 లక్షల టన్నులు, ఏపీ నుంచి 54.63 లక్షల టన్నులు సేకరించింది. ఈ సీజన్‌లో పంజాబ్‌లో వరి సాగు పెరుగకపోవడం, తెలంగాణ భారీమొత్తంలో పెరగడంతో గతేడాది కన్నా ఎక్కువగా బియ్యం వచ్చేఅవకాశం ఉన్నది. దీంతో ఎఫ్‌సీఐ బియ్యం సేకరించే రాష్ర్టాల్లో తెలంగాణ మొదటిస్థానానికి చేరకోనున్నది.

వరి సాగు, ఉత్పత్తి పైపైకి

తెలంగాణలో వరిసాగు రికార్డులను సృష్టిస్తున్నది. 2014-15లో 34.96 లక్షల ఎకరాల్లో వరిసాగు.. 24.25 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే వచ్చింది. 2019-20లో 79.58 లక్షల ఎకరాల్లో సాగై.. 112.13 లక్షల టన్నుల ధాన్యం వచ్చింది. ఈ ఏడాది వానకాలంలోనే 52.55 లక్షల ఎకరాల్లో సాగైంది. 90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సివిల్‌ సైప్లెశాఖ అంచనాలు రూపొందించింది. యాసంగితో కలిపి 165 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అంచనాలు వేసింది.

ప్రభుత్వం కృషితో పండుగైన వ్యవసాయం

వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.  రైతు బంధు ద్వారా ఏటా ఎకరాకు రూ.10వేల పెట్టుబడి అందించారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం అన్నదాతకు వరంలా మారాయి. వ్యవసాయం రూపురేఖల్ని మార్చివేశాయి. నెర్రలు బారిన నేలల్లో కాళేశ్వరం జలధారలు పసిడి పంటలను పండించాయి. ఆ పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఫలితంగా రాష్ట్రంలో సాగు వేడుకైంది. దేశం మొత్తం తెలంగాణ వైపుచూసే స్థాయికి చేరింది


తాజావార్తలు