బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 19:09:36

కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రం ముందంజ : మంత్రి ఈటల

కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రం ముందంజ : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంత్రి మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ... కరోనా పరీక్షలు నిర్వహణ సరిగా లేదని, వైద్యులకు సదుపాయాలు బాగాలేవని, రోగులకు మందుబిళ్లలు అందుబాటులో లేవని ఇలా ప్రతిపక్షాలు నిరాధార, అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి ఆరోపణలు పనిచేసే ప్రభుత్వానికి ఆటంకం కలిగించడమేనన్నారు. పీపీఈ కిట్లు 10 లక్షలకుపైన అందుబాటులో ఉన్నాయన్నారు. రోగులకు అవసరమైన మందుబిళ్లలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిపక్షాల అనవసర విమర్శలతో కాలక్షేపం చేయకుండా ప్రజల పట్ల ప్రేమ ఉంటే తమకు సరైన సూచనలు చేయాలన్నారు. 

కరోనా పరీక్షలు సంఖ్యను పెంచుతాం...

రాబోయే కాలంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. గాంధీ వైద్యుల సేవల కృషిని అందరూ అభినందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు కూడా గాంధీలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారన్నారు. అదేవిధంగా వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా ప్రభావానికి గురైన వైద్య సిబ్బందికి చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా ఆస్పత్రుల్లో రెండంచెల భద్రతా విధానాన్ని తాము ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ, నీలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌పూర్‌ ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. బాధితులకు అవసరమైన ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా ఆచరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారానే కేసులు పెరిగాయన్నారు. కరోనా విషయంలో రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నట్లు తెలిపారు.


logo