సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 18:58:24

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్‌

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : పెట్టుబడులకు అనువైన రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవన్‌లో వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, బెస్ట్‌ లివింగ్‌ సిటీ విభాగాల్లో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్నారు. టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే ఇచ్చినట్టే పరిగణించేలా చట్టం చేశామన్నారు. పరిశ్రమలకు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేవాళ్లు స్థానిక యువతకు అవకాశం కల్పించాలన్నారు. స్థానికులకు అవకాశం కల్పించే పరిశ్రమలకు ఇన్సెంటీవ్‌లు ఇస్తామన్నారు.

కేంద్రం దక్షిణాది రాష్ర్టాలను కూడా పట్టించుకోవాలన్న మంత్రి కేటీఆర్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులను దక్షిణాది రాష్ర్టాల్లో కూడా ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీకి కేంద్రం సహకారం అందించడం లేదని తెలిపారు. ప్రపంచానికే వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌కి కేంద్రం చేసిందేమి లేదన్నారు. రాబోయే బడ్జెట్‌లోనైనా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.

VIDEOS

logo