మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 12:26:51

సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతిపథంలో తెలంగాణ : గవర్నర్‌

సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతిపథంలో తెలంగాణ : గవర్నర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి సభలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని గవర్నర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్‌ దేశం అబ్బురపడుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్‌ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్‌ కోతలను అధిగమించి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు.

కేసీఆర్‌ పక్కా ప్రణాళికలతో సమస్యలను అధిగమించి రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని గవర్నర్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద రూ. 1,00,116 ఇస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్‌ తెలిపారు.


logo
>>>>>>