గురువారం 04 జూన్ 2020
Telangana - May 18, 2020 , 15:36:41

కరోనా కట్టడిలో తెలంగాణ నంబర్‌ వన్‌ : కేంద్ర మంత్రి

కరోనా కట్టడిలో తెలంగాణ నంబర్‌ వన్‌ : కేంద్ర మంత్రి

  • తెలంగాణలో అదుపులోనే కరోనా వైరస్‌
  • సీఎం కేసీఆర్‌ చర్యలు అద్భుతం

హైదరాబాద్‌ : కరోనా కట్టడిలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర జలశక్తి అభియాన్‌ మంత్రి రతన్‌లాల్‌ కటారియా ప్రశంసించారు. తెలంగాణలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉందన్న ఆయన.. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి అభియాన్ మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా సోమ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా వైర‌స్ స్థితిగ‌తులు, తాజా ప‌రిస్థితులు, వేసవిలో మంచినీటి సరఫరాపై ఆరా తీశారు. మంచినీటికి ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌టం లేదు అని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టు ద్వారా స్వ‌చ్ఛ‌మైన మంచినీరు ఇంటింటికీ అందిస్తున్నామని చెప్పారు.  

దేశంలోనే మొద‌టిసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించార‌ని, ప‌గ‌లంతా ప‌క‌డ్బందీగా లాక్ డౌన్ విధిస్తూనే, రాత్రిళ్ళు క‌ర్ఫ్యూను అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో క‌రోనా క‌ట్ట‌డిలోకి వ‌చ్చింద‌న్నారు. అయితే హైద‌రాబాద్ లోనే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌న్నారు. గ్రామాల్లో, జిల్లాల్లో దాదాపు కేసులు లేవ‌న్నారు. దీంతో హైద‌రాబాద్ లోని కొన్ని చోట్ల మాత్ర‌మే రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశామ‌ని, జిల్లాలు, గ్రామాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లుగానే ఉన్నాయ‌న్నారు. రెడ్ జోన్ల‌లో కంటైన్మెంట్ ని కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి, కేంద్ర మంత్రి క‌టారియాకు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా మాట్లాడుతూ.. ఈ విష‌యాలు తాము కూడా విన్నామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు దేశ ప‌రిస్థితిని తెలుసుకుంటున్నామని, అందులో భాగంగానే తెలంగాణ వివ‌రాలు అడిగామ‌ని చెప్పారు. అలాగే, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంతో పాటు, క‌రోనా క‌ట్ట‌డిదలోనూ ముందే ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌ని, కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్ ను అభినందించారు.


logo