బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 00:55:04

రాష్ట్రంలో వెయ్యిమందికో టాయిలెట్‌

రాష్ట్రంలో వెయ్యిమందికో టాయిలెట్‌

  • నిర్వహణలో దేశానికే ఆదర్శం 
  • యాప్‌ ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ

హైదరాబాద్‌, జనవరి 9 ( నమస్తే తెలంగాణ): మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు పబ్లిక్‌ టాయిలెట్స్‌ను వినియోగించుకొనేలా  పట్ట ణ ప్రగతి టాయిలెట్‌ మానిటరింగ్‌ సిస్టం (పీపీటీఎంఎస్‌) విధానాన్ని అమలుచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దాదాపు ప్రతి పట్టణం, నగరాల్లో మరుగుదొడ్లు నిర్మించారు. పట్టణాలకు వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా అందరికీ అందుబాటులో ఉండేలా వాటిని నిర్మించారు. పట్టణాల్లో 9వేల మరుగుదొడ్లను అతి తక్కువ సమయంలో కట్టారు. ప్రతి వేయి మందికి ఒక టాయిలెట్‌ను నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. మరుగుదొడ్ల నిర్వహణ కోసం పీపీటీఎంఎస్‌ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా మరుగుదొడ్లలో పారిశుద్ధ్యాన్ని అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. 

ట్రాన్స్‌జెండర్‌కూ....

పబ్లిక్‌, కమ్యూనిటీ, మొబైల్‌ టాయిలెట్స్‌తోపాటు మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌, ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్స్‌, వికలాంగుల టాయిలెట్స్‌ను మున్సిపాలిటీలు, పట్టణాల్లో నిర్మించారు. గతంలో మూత్రశాలలు నిర్మించడం వరకే పాలకవర్గాలు పరిమితమయ్యేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించింది. ఈ టాయిలెట్లను ప్రతి మంగళవారం, శుక్రవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేస్తారు. తరువాత తనిఖీకి సంబంధించిన ఫోటోలను యాప్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు. ఫొటోలను అప్‌లోడ్‌ చేయడంతోపాటు 18 రకాల ప్రశ్నలకు కూడా యాప్‌లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.  


logo