బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:55:00

కాల్వల్ల పారంగ..చెరువుల్ల నింపంగ

కాల్వల్ల పారంగ..చెరువుల్ల నింపంగ

  • తెలంగాణలోనూ కాల్వ నీటితో వ్యవసాయం
  • ఇక కాలంతో పనిలేదు.. కరంట్‌ అవసరంలేదు  
  • రెండు పంటలకూ పుష్కలంగా సాగునీరు
  • రంగనాయకసాగర్‌ కుడి,ఎడమ కాల్వల్లోకి కాళేశ్వర జలాలు
  • విడుదలచేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ఇదొక అరుదైన సందర్భం.. నాలుగేండ్ల క్రితం 2016 మే 2న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపనచేశారు. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత సరిగ్గా ఇదేరోజున రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాల్వలకు నీళ్లు విడుదలవడం అద్భుతం. అదేసమయంలో తుక్కాపూర్‌ వద్ద సొరంగంలోకి గోదారమ్మ ప్రవేశించడం మరో అపూర్వ సన్నివేశం. ఆ నీళ్లను చూడంగనే సాక్షాత్‌ రాష్ట్ర మంత్రి తనను తాను మర్చిపోయారు.. చిన్నపిల్లాడిలా మారి ఆ నీళ్లను దోసిట్లో తీసుకొని అందరిపై చల్లారు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఒళ్లే తెలియలేదు. యువకుల్లా మారిపోయి నీళ్లల్లో దూకి ఈతకొట్టారు. వాళ్ల సంబురానికి అంతేలేకుండా పోయింది. నీళ్లు రానే రావనుకున్న గడ్డమీద కాళేశ్వర జలాలు ఉరుకులు పెడుతుంటే.. ఆ గడ్డమీద పుట్టిన బిడ్డలు తాము ప్రజాప్రతినిధులమన్న మాట మరిచి సామాన్యుల్లా సంతోషపడ్డారు. తెలంగాణలోని ప్రతి రైతు కండ్లల్లోని ఆనందం వారిలో కనిపించింది.


సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: సిద్దిపేట కరువుతీరింది. జిల్లాలోని చెరువుల్లోకి కాళేశ్వరం జలాలు పరుగులుపెట్టాయి. దశాబ్దాల గోస తొలిగిపోయింది. తెలంగాణ లోనూ కాల్వనీటితో ఎవుసంచేసే రోజు లొచ్చాయి. శనివారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్‌నుంచి కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయా యి.  జలాల విడుదలకు ముందు మంత్రి హరీశ్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక కరువు అనే పదాన్ని తమ నిఘంటువులోనుంచి తొలిగిస్తామన్నారు. కాలం, కరంట్‌తో పనిలేకుండా రెండు పంటలు పండించుకోనే రోజులు వచ్చాయని చెప్పారు. 365 రోజులపాటు రంగనాయకసాగర్‌కు జాలాలు వస్తాయని, దీంతో ఈ ప్రాంతంలో కరువు శాశ్వతంగా తొలిగిపోతుందని చెప్పా రు. రంగనాయకసాగర్‌ ద్వారా 1,10,718 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఎడమకాల్వనుంచి 70,698 ఎకరాలు, కుడి కాల్వ నుంచి 40,020 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. 

రాజన్న సిరిసిల్ల్ల జిల్లాలో 33,384 ఎకరాలకు, సిద్దిపేట జిల్లాలో 77,334 ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. ఎడమ, కుడి కాల్వల ద్వారా అన్ని చెరువులు, కుంటలు, వాగులు ఈ వేసవి కాలంలోనే నింపుతామని మంత్రి హరీశ్‌ తెలిపారు. సిద్దిపేట వాగు కింద 28 చెక్‌డ్యాంలకు, శనిగరం చెరువుకు కూడా నీళ్లు వదులుతామని చెప్పారు. నక్కవాగు, పెద్దవాగు కింద ఉన్న అన్ని చెక్‌డ్యాంలను కాళేశ్వరం జలాలతో నింపుతామన్నారు. మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వల నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పారు. వర్షాకాలం వరకు పిల్ల కాల్వల నిర్మాణాన్ని పూర్తిచేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి , ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఈఎన్సీ హరిరాం, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ ఆనంద్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు భూపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డితో కలిసి గోదావరి జలాలను వదిలారు.

ఈత కొట్టిన మెదక్‌ ఎంపీ, మానకొండూరు ఎమ్మెల్యే 


రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు ఎడమ కాలువలోకి విడుదలచేసిన అనంతరం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఎడమ కాల్వలోకి దిగి సరాదాగా కాసేపు ఈత కొట్టి ఆనందంతో ఉప్పొంగిపోయా రు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు కూడా ఎడమ కాల్వ దగ్గర ఈఎన్‌సీ హరిరాం, ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు పన్యాల భూపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డితో కలిసి గోదావరికి నమస్కరించి జలాలను నెత్తిన చల్లుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు అక్కడున్న వారిపై నీళ్లు చల్లుతూ ఎంతో సరదాగా కనిపించారు. అనంతరం కాల్వలో గోదావరి ప్రవాహ నేపథ్యంలో సెల్ఫీ తీసుకొన్నారు.logo