సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:00:01

జల్‌జీవన్‌ మిషన్‌లో అగ్రగామి తెలంగాణ

జల్‌జీవన్‌ మిషన్‌లో అగ్రగామి తెలంగాణ

  • కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి షెకావత్‌ ప్రశంస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై మంగళవారం అన్ని రాష్ర్టాల మంత్రులు, అధికారులతో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 54.37 లక్షల గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న తెలంగాణను ప్రత్యేకంగా ప్రశంసించారు. జల్‌జీవన్‌మిషన్‌ అమలులో ప్రతిభ చూపుతున్న రాష్ర్టాలకు ఇన్సెంటివ్‌ గ్రాంట్స్‌ ఇస్తామని ఆయన చెప్పారు. అన్ని రాష్ర్టాల్లో 2024 వరకు ఇంటింటికీ తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్రం 2019 ఆగస్టు 15న జల్‌జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో కేంద్ర ప్రభుత్వంకన్నా ముందే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. రూ.45,028 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి నల్లా ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గోవా మినహా ఇతర రాష్ర్టాలు ఏవీ తెలంగాణ దరిదాపుల్లో లేవు.