శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:38:33

పెట్టుబడుల అడ్డా తెలంగాణ

పెట్టుబడుల అడ్డా తెలంగాణ

  • రాష్ర్టానికి తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయసంస్థలు
  • అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రాకతో పారిశ్రామికవర్గాల్లో హర్షం
  • స్వరాష్ట్రంలో 13,803 పరిశ్రమలు..2లక్షల కోట్ల పెట్టుబడులు..14.5 లక్షల మందికి ఉపాధి
  • కరోనాకాలంలో 1,658 పరిశ్రమలు.. రూ.6,060 కోట్ల పెట్టుబడులు.. 55 వేల మందికి ఉపాధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన అమెజాన్‌ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడంతో రాష్ట్రంలోని పారిశ్రామికవర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి వచ్చిన చరిత్ర లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఓ విదేశీ కంపెనీ తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావడంపై పరిశ్రమవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రాకతో తెలంగాణ ఇకపై డాటా సెంటర్‌ హబ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ విధానంతో రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 13,803 పరిశ్రమలు వస్తే ఇందులో అత్యధికంగా ఇంజినీరింగ్‌ విభాగంలో 2,721 ఉన్నాయి. ఆ తరువాత ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో 2,152 పరిశ్రమలు, ఆగ్రోబేస్డ్‌ ఇండస్ట్రీ, కోల్డ్‌ స్టోరేజ్‌ పరిశ్రమలు ఎక్కువగా వచ్చాయి. వీటి ద్వారా రూ. 2,04,121కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. ఈ సంస్థల ద్వారా 14,48,858 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 

మంత్రి కేటీఆర్‌కు అభినందనలు

అమెజాన్‌ సంస్థ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేసిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు పలువురు అభినందనలు తెలిపారు. అమెజాన్‌ సంస్థ రూ. 20,761 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో వెబ్‌ సర్వీసెస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రగతిభవన్‌లో శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపినవారిలో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్మన్‌ అనిత తదితరులున్నారు. 

కరోనా సమయంలో 1,658 పరిశ్రమలు

ఈ ఏడాది ప్రారంభం నుంచే కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. బహుళజాతి సంస్థలు సైతం తమ వ్యా పార విస్తరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చాయి. 2020 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ నాటికి తెలంగాణకు 1,658 పరిశ్రమలు రాగా వీటి ద్వారా రూ.6,060 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 55,169 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కరోనా సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ పరిశ్రమల్లో ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. 1,350కోట్లు, సాయి లైఫ్‌సైన్సెస్‌ రూ.400కోట్లు, నేషనల్‌ పేమెం ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.500కోట్లు, మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ రూ. 1,100కోట్లు, మెడ్‌ట్రానిక్స్‌ రూ.1,200కోట్లు పెట్టుబడులను పెట్టాయి. శుక్రవారం అమెజాన్‌ సంస్థ రూ.20,761కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది.

కరోనా సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ పరిశ్రమలు, వాటి పెట్టుబడులు

ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ రూ.1350కోట్లు, 

సాయి లైఫ్‌సైన్సెస్‌ రూ.400కోట్లు, 

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.500కోట్లు, 

మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ రూ.1100కోట్లు, 

మెడ్‌ట్రానిక్స్‌ రూ.1200కోట్లు

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రూ.20,761కోట్లు