శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:33:19

80 లక్షల ఎకరాలకు జీవం

80 లక్షల ఎకరాలకు జీవం
  • తెలంగాణ సాగునీటి రంగ ప్రస్థానం అద్భుతం
  • సామాజిక ఆర్థిక సర్వే- 2020 నివేదిక వెల్లడి
  • కాళేశ్వరంలో ఐదుదశల్లో విజయవంతంగా ఎత్తిపోత
  • మిషన్‌ కాకతీయతో అన్నదాతకు ఆర్థికపుష్టి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:అనతికాలంలోనే తెలంగాణ సాగునీటిరంగం అద్భుత విజయాలను సొంతం చేసుకున్నది. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు రీడిజైనింగ్‌ ప్రాజెక్టులూ ఫలాలను అందిస్తుండటంతో తెలంగాణ ఆకుపచ్చ మాగాణంగా మారుతున్నదని సామాజిక, ఆర్థిక సర్వే- 2020 నివేదిక పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ నివేదికను విడుదలచేశారు. ఇందులో సాగునీటిరంగంలో రాష్ట్రం సాధించిన అద్భుత విజయాలను సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. వీటిలో 22 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు, ఒక వరదకాల్వ, రెండు ఆధునీకరణ ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 70 లక్షల ఆయకట్టుతోపాటు, మరో పది లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలోనే 80 లక్షల ఎకరాలకు జీవం రికార్డు.


రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తయిన ప్రాజెక్టులు

భారీ ప్రాజెక్టులు: కోయిల్‌సాగర్‌, అలీసాగర్‌, గుత్ప, భక్త రామదాసు, సింగూరు ప్రాజెక్టు కాల్వలు

మధ్యతరహా ప్రాజెక్టులు: రాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, గడ్డెన్న-సుద్దవాగు, చౌటుపల్లి హన్మంతరావు, కిన్నెరసాని, నాగార్జునసాగర్‌ ఆధునీకరణ ప్రాజెక్టు.


ప్రపంచ యవనికపై మేటి ప్రాజెక్టు

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టుగా కీర్తికెక్కిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తాజా ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది. నివేదికలో కాళేశ్వర ప్రస్థానాన్ని సమగ్రంగా వివరించారు. 45 లక్షల ఎకరాలకు జీవం పోసేలా సీఎం కేసీఆర్‌ రీడిజైనింగ్‌ చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరిజలాల్ని ఐదు దశల్లో విజయవంతంగా ఎత్తిపోసిన వివరాలను పొందుపరిచారు. గోదావరి నది నుంచి ఈ నెల 4వ తేదీవరకు లక్ష్మీ పంపుహౌజ్‌ నుంచి 51.77, సరస్వతి పంపుహౌజ్‌ నుంచి 46.53, పార్వతి పంపుహౌజ్‌ నుంచి 44.06, నంది పంపుహౌజ్‌ నుంచి 59.94, గాయత్రి పంపుహౌజ్‌ నుంచి 57.64 టీఎంసీలు విజయవంతంగా ఎత్తిపోసినట్టు పేర్కొన్నారు.


దిగుబడి పెంపు.. వ్యయం తగ్గింపు

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం కూడా అద్భుత ఫలితాలు సాధించిందని సామాజిక, ఆర్థిక సర్వే - 2020 స్పష్టంచేసింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా రైతులు పొలాల్లోకి తరలించుకున్న పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35-50 శాతానికి తగ్గిందని వెల్లడించింది. దీంతో రైతులు ఎకరాకు వెచ్చించే వ్యయంలో 27.6 శాతం ఆదా కావడంతోపాటు, పంటలను బట్టి ఎకరాకు రూ.3,700-7,500 వరకు వ్యయం తగ్గిందని పేర్కొన్నది. ఈ పథకం కింద మొత్తం నాలుగు విడుతల్లో 15లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగినట్టు వెల్లడించింది.


logo