శనివారం 04 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 03:06:19

‘పిక్సెల్‌' పిచ్చి కూతలు

‘పిక్సెల్‌' పిచ్చి కూతలు

  • కరోనా వ్యాప్తిపై ఇండియా ఇన్‌ పిక్సెల్‌ దుష్ప్రచారం
  • తెలంగాణపై బురదచల్లడమే లక్ష్యంగా తప్పుడు లెక్కలు
  • అడ్డగోలు రాతలు.. పొంతనలేని వివరణతో అభాసుపాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాస్తవాలకు పాతరేసి సంచలనం కోసం అసత్యాలను ప్రచారంచేసి తాము వెలుగులోకి రావడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ‘ఇండియా ఇన్‌ పిక్సెల్‌' అనే సంస్థ కూడా అదే పనిచేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారీగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇండియా ఇన్‌ పిక్సెల్‌ అనే సంస్థ ఇవేమీ పట్టించుకోకుండా అడ్డగోలు రాతలురాసింది. దేశంలోని రాష్ర్టాల్లో వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకొనే అవకాశం ఎంతున్నదో ‘ఊహించి’ ఓ చిత్రాన్ని విడుదలచేసింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో సామాజికవ్యాప్తి దశ ముప్పు 143 శాతంగా, తెలంగాణలో 122 శాతంగా ఉందని చూపించింది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాల్లో సామాజికవ్యాప్తి దశ ముప్పు తక్కువగా చూపించింది. దీనిపై అన్ని వైపులనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పొంతనలేని వివరణ ఇచ్చింది.

కప్పిపుచ్చుకొనే యత్నం

ఈ గణాంకాలను రూపొందించేందుకు ఆయా రాష్ర్టాల్లోని మొత్తం కేసులు, రికవరీ, క్వారంటైన్‌ చేసినవారి సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నది. జనాభా, కరోనా కేసుల శాతం, చేస్తున్న పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, హోంక్వారంటైన్‌ వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎలా లెక్కిస్తారంటూ నెటిజన్లు ఉతికిఆరేశారు. కరోనాధాటికి చిగురుటాకులా వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ మీ దృష్టిలో సురక్షితమా? అని ప్రశ్నించారు. కేసుల నమోదులో టాప్‌-10లో ఉన్న రాష్ర్టాలను ఎందుకు తక్కువచేసి చూపారని ప్రశ్నలు గుప్పించారు. దీంతో సంస్థ కప్పిపుచ్చుకొనే ప్రయత్నంచేసింది. క్వారంటైన్‌చేసిన ప్రతి వంద మందిలో ఎంతమందికి పాజిటివ్‌ వచ్చింది? అనేదాని ఆధారంగా లెక్కించినట్టు తెలిపింది. ‘అంటే.. ఢిల్లీ, తెలంగాణలో క్వారంటైన్‌ చేసినవారందరికీ పాజిటివ్‌ వచ్చిందన్నమాట. పైగా క్వారంటైన్‌లో లేనివారికీ వైరస్‌ సోకిందన్నమాట. బయటఉన్నవారికి కూడా కరోనా వచ్చిందన్న మాట’ అంటూ నెటిజన్లు సంస్థను ఎద్దేవాచేశారు. 

చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి

ఇండియా ఇన్‌ పిక్సెల్‌ సంస్థ తప్పుడు గణాంకాలతో ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని, విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి సోషల్‌మీడియా వేదికగా పలువురు విన్నవించారు. ఈ సంస్థ గతంలో విడుదలచేసిన అనేక ఫొటోలు, నివేదికలపైనా పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దేశంలోని మెట్రోరైలు మార్గాలు ఇవేనంటూ ఇటీవల విడుదలచేసిన ఓ ఫొటోలో కోల్‌కతాలో ఇంకా పూర్తికాని లైన్‌ను మ్యాప్‌లో గుర్తించింది. అదేసమయంలో నిర్మాణంలో ఉన్న ఇతర మెట్రో నిర్మాణాలను విస్మరించింది.logo