ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:12:35

ఆరోగ్య సమాజానికి పోషణ

ఆరోగ్య సమాజానికి పోషణ

  • రేపటినుంచి మాసోత్సవం
  • టీశాట్‌, ఆన్‌లైన్‌లో అవగాహన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరోగ్య సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోషణ మాసోత్సవం చేపట్టనున్నది. నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలు, గర్భిణులు, పాలి చ్చే తల్లుల్లో 2022 నాటికి పోషకాహార లోపం లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. పోషణ మాసోత్సవంలో భాగంగా పోషకాహార లోపం, రక్తహీనత, బాల్యవివాహాలు, పరిసరాల పరిశుభ్రత, పెరట్లో పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలతోపాటు రైతులు పండిస్తున్న పంటలు, వాటిలో పోషక విలువలపై అవగాహన కల్పించనున్నది. ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌వాడీ టీచర్ల ద్వా రా రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో సమావేశాలను చేపట్టడంతోపాటు రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీకేంద్రాల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ రక్తహీనత, విటమిన్‌ లోపాలను ఎలా అధిగమించవచ్చో అవగాహన కల్పిస్తారు. ఆకుకూరలు, పప్పులు, పండ్లు, మ జ్జిగ ఇలా.. అందుబాటులో ఉండే ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటాయో వివరిస్తారు. రక్తహీనత, ఐరన్‌, కాల్షియం లోపాలవల్ల కలిగే నష్టాలను వెల్లడిస్తారు. మహిళలు, ఆరేండ్లలోపు చిన్నారులు, కౌమారదశలో ఉన్న బాలికల్లో పోషకాహార లోపం తలెత్తకుండా ఏంచేయాలో చెప్తారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు పోషకాహారం గురించి వివరిస్తారు. ఐసీడీఎస్‌తోపాటు పలు ప్రభుత్వశాఖలు కూడా ఈ  పాలుపంచుకోనున్నాయి. ఇందులో ప్రజ లు భాగస్వామ్యం కావాలని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు కోరుతున్నారు. 

వీడియోలతో అవగాహన

కరోనా నేపథ్యంలో ప్రజలతో నేరుగా సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి. అవకాశం ఉన్నచోట తక్కువ మందిని కలిసి అవగాహన కల్పించడంపై ఐసీడీఎస్‌ అధికారులు దృష్టి పెట్టనున్నారు. తల్లిపాల ప్రాధాన్యం, నవజాత శిశువుల సంరక్షణ, పోషకాహారం గురించి తెలిపే తక్కువ నిడివిగల వీడియోలను రూపొందించనున్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిన అవగాహన కల్పించడంతోపాటు వెబినార్‌, టీశాట్‌ ద్వారా కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. నిపుణులు, శాఖాపరమైన విభాగాలు డిజిటల్‌ సమావేశాలు నిర్వహించి వివిధ మాధ్యమాల ద్వారా ‘పోషణ’కు విస్తృత ప్రచారం కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాచరణ చేపట్టింది.logo