శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 01:39:41

రైతులోకం.. హర్షాతిరేకం

రైతులోకం.. హర్షాతిరేకం

  • నూతన రెవెన్యూ చట్టంపై సంతోషం
  • స్వాగతిస్తూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు
  • రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబురం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: నూతన రెవెన్యూ చట్టంపై రైతులోకం హర్షం వ్యక్తంచేస్తున్నది. అవినీతి అంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన చట్టాన్ని మనసారా స్వాగతిస్తున్నది. సాగులో భాగమైన ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో కదలివచ్చి సంబురాలు చేస్తున్నది. భారీ ర్యాలీలు, జై కేసీఆర్‌ నినాదాలతో హోరెత్తిస్తున్నది. పలు జిల్లాల్లో బుధవారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకంచేసి అభిమానం చాటారు. కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలాల నుంచి రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు దాదాపు 300 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో 28 గ్రామాల రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు 200 ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకేంద్రం, జనగామ జిల్లా దేవరుప్పులలోని తెలంగాణ తల్లి సర్కిల్‌ వద్ద టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు సంబురాలు చేసుకున్నారు. భూపాలపల్లి నుంచి గణపురం క్రాస్‌రోడ్‌ వరకు 15 కిలోమీటర్ల మేర ఎడ్లబండ్లు, 800 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ట్రాక్టర్ల భారీ ర్యాలీని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రారంభించారు.  ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల్లోని మధిర, జూలూరుపాడు, ఏన్కూరు, వైరా, కొణిజర్ల మండలాల్లో రైతన్నలు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మధిరలో జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లకు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలను కట్టి ర్యాలీలో పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలోని పలు మండలాల్లో వందల ట్రాక్టర్లతో ఎమ్మెల్యే రాములునాయక్‌ నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ జయహో అంటూ నినాదాలు చేశారు. 

పటాకులు కాల్చి సంబురాలు..

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మెదక్‌ జిల్లా చేగుంటలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో వంద ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతులకు కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఆధ్వర్యంలో వందల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో 500 ట్రాక్టర్లు, 200 ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు.