శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 01:12:10

7 నుంచి తెరుచుకోనున్న హైకోర్టు

7 నుంచి తెరుచుకోనున్న హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ పరిస్థితులతో మూతపడ్డ హైకోర్టు మళ్లీ తెరుచుకోనున్నది. ఈ నెల 7వ తేదీ నుంచి 11 వరకు హైకోర్టులో భౌతిక విచారణ ప్రయోగాత్మకంగా ప్రారంభంకానున్నది. పరిమిత ధర్మాసనాలు భౌతిక విచారణ చేపడుతాయని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ గురువారం జారీచేసిన ఉత్తుర్వుల్లో పేర్కొన్నారు. చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌, జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరాం, జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌, జస్టిస్‌ జీ శ్రీదేవి ధర్మాసనాలు భౌతిక విచారణ చేపట్టనున్నాయి. మిగతా ధర్మాసనాలు వీడియోకాన్ఫరెన్స్‌ విచారణ కొనసాగిస్తాయి. కేసులను ఆన్‌లైన్‌, ఫిజికల్‌ ఫైలింగ్‌ రెండు పద్ధతుల్లో స్వీకరిస్తామని, జ్యుడిషియల్‌ అకాడమీతోపాటు హైకోర్టులో సైతం వీడియోకాన్ఫరెన్స్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. మరోవైపు, కరీంనగర్‌ జిల్లా కోర్టును కూడా ప్రయోగాత్మకంగా తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విచారణ చేపట్టాలని పేర్కొన్నది.  

 సీమ ఎత్తిపోతలపై తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ)లో వాదనలు ముగిశాయి. ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, టెండర్లు పిలిచిందని, దానిని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌పై అన్నివర్గాల వాదనలు ముగియడంతో ఎన్జీటీ చెన్నై ధర్మాసనం గురువారం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది.


logo