శనివారం 04 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 00:57:30

చరమాంకంలో భరోసా వృద్ధాశ్రమాల నిర్వహణపై హైకోర్టుకు ప్రభుత్వం వివరణ

చరమాంకంలో భరోసా వృద్ధాశ్రమాల నిర్వహణపై హైకోర్టుకు ప్రభుత్వం వివరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జీవిత చరమాంకంలో ఏ అండా లేనివారిని ఆదుకుంటున్నామని తెలిపింది. వృద్ధాశ్రమాల్లో దీన పరిస్థితులపై రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతున్నది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలుచేసింది. రాష్ట్రంలో వృద్ధాశ్రమాల పరిస్థితి, అందిస్తున్న నిధుల వివరాలను తెలియజేసింది. ఆయా ఎన్జీవోల ఆధ్వర్యంలో రిజిస్టర్‌ అయిన ఓల్డేజ్‌హోంలకు కలెక్టర్ల ఆమోదంతో ఆర్థికసాయం విడుదలచేస్తున్నట్టు చెప్పింది.

నిత్యం తనిఖీలు.. హెల్ప్‌లైన్‌

వృద్ధాశ్రమాల్లో నిత్యం తనిఖీలుచేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నది. వృద్ధులు సమస్యలు చెప్పుకోవడానికి విజయవాహిని చారిటబుల్‌ ట్రస్ట్‌, టాటా ట్రస్ట్‌ భాగస్వామ్యంతో 14567 హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేసినట్టు హైకోర్టుకు వివరించింది. అంశాలపై హైకోర్టు ఆదేశాలను తెలియజేస్తూ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడికి లేఖరాసి,  కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద సహకరించాలని కోరామని పేర్కొన్నది. వృద్ధాశ్రమాల నిర్వహణ అంశాలపై సమగ్ర సమాచారంతో వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వృద్ధాశ్రమాలను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి సాఫ్ట్‌వేర్‌ ఈ నెల 30నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. వృద్ధాశ్రమాలు, అనాథ బాలల శరణాలయాలను కలిపి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందిస్తూ కరోనా వ్యాప్తి తగ్గాక పైలెట్‌ ప్రాజెక్టు కింద రెండింటిని కలిపి ఒక ఆశ్రమం ఏర్పాటుచేసి పరిశీలిస్తామని చెప్పింది.logo