బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:08:17

డిగ్రీ, పీజీ పరీక్షలకు లైన్‌క్లియర్‌

డిగ్రీ, పీజీ పరీక్షలకు లైన్‌క్లియర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో నిలిచిన డిగ్రీ, పీజీతోపాటు పలు ప్రవేశ పరీక్షలను ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పరీక్షలు ఆఫ్‌లైన్‌లో లేక ఆన్‌లైన్‌లో నిర్వహించాలా అన్న అంశాన్ని తాము నిర్ణయించలేమని పేర్కొన్నది. కొవిడ్‌-19 నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను ప్రమోట్‌చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు మరోమారు విచారణచేపట్టింది. పరీక్షలను ఏవిధంగా నిర్వహించాలన్నదని ప్రభుత్వ విధానపర నిర్ణయం కిందికి వస్తుందని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. కాబట్టి పరీక్షల నిర్వహణ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అకడమిక్‌ ఇయర్‌ వృథాకాకుండా ఉండాలన్నదే తమ అభిమతమని తెలిపింది. అందుకు అనుగుణంగా పరీక్షలను త్వరగా ముగించాలని, సప్లిమెంటరీ పరీక్షలను కూడా త్వరలోనే నిర్వహించే ఏర్పాట్లుచేయాలని సూచించింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తర్వాత నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలు రాసినా వారు రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్టే పరిగణిస్తామని పేర్కొన్నారు. చివరి సంవత్సరం పరీక్షలను భౌతికంగా రాతపూర్వకంగా నిర్వహిస్తామని, ఆన్‌లైన్‌ పరీక్షలు సాధ్యంకాదన్నారు. 


logo