హైదరాబాద్ సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, మే 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఓ న్యాయవాది దారుణహత్యకు గురయ్యారు. తెల్లవారుజామున తన ఇంటి ముందు ఉండగా, కారులో వచ్చిన దుండగులు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. హైదరాబాద్ పాత మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. నాంపల్లి ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాతమాసబ్ట్యాంక్ పరిధిలో ఉదయం 5.45 గంటల సమయంలో మొయిజుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు నంబర్‌ప్లేట్ లేని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో ఆయన సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. వేగంగా వస్తున్న కారును గమనించి ఆయన తప్పించుకునేలోపే ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన మొయిజుద్దీన్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి ఆబిడ్స్ చాపెల్‌రోడ్డులోని మరో దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ అక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఉదయం నుంచే సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో న్యాయవాది హత్య కేసు సంచలనంగా మారిం ది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. దాడి చేసిన వాహనం,నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు. నిందితులు పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మొదట హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసినప్పటికీ సంఘటన జరిగిన తీరును పరిశీలించిన తర్వాత హత్యకేసుగా నమోదు చేశారు.
న్యాయవాది మొయిజుద్దీన్ హత్యకు దుండగులు పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఆయన దినచర్యను గమనించి, ఉదయం ఆయన స్విమ్మింగ్‌కు, వాకింగ్‌కు వెళ్లే సమయాన్ని పసిగట్టారు. ఆ సమయంలో కాలనీలో ఎవరూ బయటకు రాకపోవడాన్ని గమనించి వాహనాన్ని కొంతదూరంలో నిలిపిఉంచారు. ఆయన బయటకు రాగానే అతివేగంగా వచ్చి ఢీకొట్టి హత్య చేశారని, ఇది కచ్చితంగా ప్రొఫెషనల్స్ పనేనని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు చెప్పారు. ఖాజామొయిజుద్దీన్ వాదించిన కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలోని కేసులకు సంబంధించిన ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
ఖాజామొయిజుద్దీన్ హత్యపై ఆయన కుమారుడు ఫర్హాన్ కీలక విషయాలు వెల్లడించారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పోరాటం చేస్తుండటంతోనే తన తండ్రిని ప్రత్యర్థులు హత్యచేశారని ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడేందుకు గత కొన్నేండ్లుగా పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్ వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని తెలిపారు. ఆ వక్ఫ్‌బోర్డు స్థలాల గురించి ఎప్పటినుంచో కేసులు వేస్తూ తన తండ్రి పోరాడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 6 నెలల క్రితం ముజాహిద్ ఆలంఖాన్ తమ కార్యాలయానికి వచ్చి.. ‘నీకిదే లాస్ట్ చాన్స్.. మళ్లీ వక్ఫ్‌బోర్డు స్థలాల జోలికి రావద్దు’ అని బెదిరించి, మీకు రెండు కోట్లు ఇస్తా దుబాయ్‌కి వెళ్లండి! లేదా? ఏమి జరిగినా తమకు తెలియదని బెదిరించారని మీడియా ఎదుట ఫర్హాన్ చెప్పారు. ప్రధానంగా ఆలంఖాన్ ఫ్యామిలీ అక్రమాలపై కేసులు వేసి వాదిస్తుండటంతోనే తన తండ్రిని హత్య చేయించారని అనుమానం వ్యక్తంచేశారు. తన తండ్రిపై దాడి జరుగడం ఇది ఆరోసారని, గతంలో తమ ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారని, ఇప్పుడు ఏకంగా హత్య చేశారని ఆరోపించారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏం జరిగినా కాంగ్రెస్ నాయకుడు ఆలంఖాన్దే బాధ్యత అని, తమకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫర్హాన్ కోరారు.
ఖాజామొయిజుద్దీన్ హత్య వెనుక భారీ భూవివాదాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. వక్ఫ్ ఆస్తులు, ఇతర భూవ్యవహారాలకు సంబంధించి స్థానిక కాంగ్రెస్ నేతలు ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్‌తో న్యాయవాది ఖాజామొయిజుద్దీన్కు గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఈ ఇద్దరు నేతలు మొయిజుద్దీన్‌కు హాని తలపెట్టడానికి ప్రయత్నించారని, దీనిపై ఇప్పటికే వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదైనట్టు మృతుడి కుటుంబసభ్యులు, సహచర న్యాయవాదులు ఆరోపించారు. మలక్‌పేటలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల వివాదాలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక భూమాఫియా ముఠా ప్రమేయం ఉన్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పలు సున్నితమైన కేసులను మొయిజుద్దీన్ చురుకుగా నిర్వహిస్తూ వాటిలో జోక్యం చేసుకుంటున్నారని, అలాగే ఆక్రమణ ప్రయత్నాలను వ్యతిరేకించినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతోనే ముఠా హత్యచేసి ఉండవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.