e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంపు

తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంపు

తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంపు
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం
  • 32 మంది శాశ్వత జడ్జీలు, 10 మంది అదనపు న్యాయమూర్తులు
  • సత్వర న్యాయానికి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ చర్యలు
  • అందులోభాగంగానే జడ్జీల సంఖ్య పెంపు
  • 2.46 లక్షల కేసుల పరిష్కారానికి మార్గం
  • ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏండ్ల కల

హైదరాబాద్‌, జూన్‌ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 కు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సంబంధిత ఫైలుపై ఆయన బుధవారం సంతకం చేశారు. జడ్జీల సంఖ్యను ఏకంగా 75% పెంపుదల చేశారు. వీరిలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు, మిగిలిన పది మంది అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు. 42మందిలో 28 మంది బార్‌ అసోసియేషన్‌ నుంచి న్యాయవాదులను ఎలివేషన్‌ చేస్తారు. మిగిలిన 14 మందిని జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఎంపిక చేస్తారు. ఈ నిర్ణయం ఈ నెల 8 నుంచే అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 2019 ఫిబ్రవరి 13న హైకోర్టు ప్రధాన నాయమూర్తి, తర్వాత గవర్నర్‌, సీఎం కేసీఆర్‌.. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్రప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రులు కూడా సమ్మతి తెలిపారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించారు. తెలంగాణ హైకోర్టు ప్రతిపాదనకు కేంద్రన్యాయశాఖ ఈ ఏడాది మే 27న ఆమోదం తెలిపి, ఈ నెల 7న సీజేఐకి ఫైలు పంపింది. ఫైలు అందిన వెంటనే జడ్జిలను నియమిస్తూ సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను పెంచి, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తేనే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ప్రస్తుతం పెండింగులో ఉన్న 2.46 లక్షలకు పైగా కేసుల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. హైకోర్టులో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. సీజేఐ ఆమోదానికి అనుగుణంగా కేంద్రన్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నది. జడ్జిల పెంపు నిర్ణయంపై బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ కొంతం గోవర్థన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ కల సాకారం
రాష్ట్రం ఏర్పడగానే హైకోర్టు విభజన కోసం పలుమార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సీఎం కేసీఆర్‌ అనుకొన్నది సాధించారు. 2019 జనవరి 1న ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఏపీ హైకోర్టులుగా విడిపోయింది. ఆ రోజుకు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌ కేసులు 1.87 లక్షలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య అనూహ్యంగా 2,46,554కు పెరిగింది. జడ్జిలు అప్పుడు ప్రధాన న్యాయమూర్తితో కలిపి 13 మంది ఉంటే ఇప్పుడు సీజేతో కలిపి 14 మందే ఉన్నారు. అప్పుడు 11 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పుడు పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెండింగ్‌ కేసులు తగ్గించాలంటే జడ్జిల సంఖ్య పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన సీఎం.. కేంద్రానికి, సుప్రీంకు చాలాసార్లు విన్నవించారు. ప్రధాని, కేంద్రన్యాయశాఖమంత్రి, సీజేఐకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా జస్టిస్‌ రమణ నిర్ణయం తీసుకొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంపు

ట్రెండింగ్‌

Advertisement