గురువారం 04 జూన్ 2020
Telangana - May 21, 2020 , 00:45:00

50 శాతం ఫీజు చెల్లించండి

50 శాతం ఫీజు చెల్లించండి

  • మిగతా మొత్తానికి బాండ్‌ ఇవ్వాలి
  • పీజీ మెడికల్‌ ఫీజుల కేసులో హైకోర్టు 
  • తుది ఉత్తర్వులకు లోబడి ఫీజులని వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పీజీ మెడికల్‌ కోర్సులకు సంబంధించి పెంచిన ఫీజుల్లో ఏ-క్యాటగిరీ విద్యార్థులు 50 శాతం, బీ 1 క్యాటగిరీ విద్యార్థులు 60 శాతం ఫీజు చెల్లించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనార్టీ, నాన్‌ మైనార్టీ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను ఖరారుచేస్తూ ప్రభుత్వం జీవో 20ను జారీచేసింది. దీనిని సవాల్‌చేస్తూ 120 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కొవిడ్‌ 19 నేపథ్యంలో పెరిగిన ఫీజులు చెల్లించడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారంగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటు విద్యార్థులు, అటు మెడికల్‌ కాలేజీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమతూకంగా వ్యవహరించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ధర్మాసనం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పీజీ మెడికల్‌ కోర్సుల్లో ఏ- క్యాటగిరీ విద్యార్థులు 50 శాతం, బీ 1 క్యాటగిరీ విద్యార్థులు 60 శాతం ఫీజు చెల్లించాలని, మిగతా మొత్తానికి బాండ్‌ ఇవ్వాలని ఆదేశించింది. మేనేజ్‌మెంట్‌ కోటాలోని మిగతా క్యాటగిరీలు, ఎన్నారై కోటా విషయం లో జోక్యం చేసుకోని ధర్మాసనం.. విచారణను నాలుగువారాలు వాయిదా వేసింది. టీఏఎఫ్‌ఆర్సీ, మెడికల్‌ కాలేజీలు కౌంటర్లు దాఖలుచేయాలని పేర్కొన్నది. పెరిగిన ఫీజుల అంశం తాము జారీచేసే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టంచేసింది.


logo