శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 14:28:53

క‌రోనా ఎఫెక్ట్: తెలంగాణ‌లో కొవిడ్ యాప్

క‌రోనా ఎఫెక్ట్: తెలంగాణ‌లో కొవిడ్ యాప్

హైద‌రాబాద్‌: రోజురోజుకు క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్‌ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేయ‌డానికి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ను ఎలా వినియోగించాలన్న దానిపై కలెక్టర్లకు ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ లేఖ రాశారు. ఈ యాప్ ద్వారా ఎలాంటి సమాచారం పంపాలన్న దానిపై వారికి మార్గదర్శ‌కాలు ఇచ్చారు.

గ్రామాలవారీగా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారిని, కోవిడ్‌ లక్షణాలున్న అనుమానితుల‌ను గుర్తిస్తారు. వారిలో చాలామంది వద్ద ట్యాబ్‌లు ఉన్నందున ఆ ట్యాబ్‌లలో ఈ కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు.  వారు ఇంటింటి సర్వే చేసి, ఆ సర్వే వివరాలను ప్రతిరోజూ తమ ట్యాబ్‌లోని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది విదేశాల నుంచి వచ్చారు, ఎందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు, ఎందరు అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నారన్న సమాచారాన్ని వారు సేకరిస్తారు. 

అంతేగాక ఎంతమంది రిస్క్‌లో ఉన్నారు, ఎంతమందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు? వంటి వివరాలను సేకరిస్తారు. ఆయా వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశాక దాన్ని గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారు. అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలిస్తారు. మున్ముందు ఈ యాప్‌ను మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎవరైనా కోవిడ్‌ బాధితులు తమ వివరాలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే వారి వద్దకు వైద్య సిబ్బందిని పంపిస్తారు. 


logo