శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 04:12:17

ఆన్‌లైన్‌ చదివింపులు!

ఆన్‌లైన్‌ చదివింపులు!

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లకు డిమాండ్‌

హెడ్‌ఫోన్లు, వెబ్‌క్యామ్‌లకు ఫుల్‌ గిరాకీ

రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెరిగిన విక్రయాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా దెబ్బకు పరీక్షలు వాయిదాపడ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియదు. ఆ లోపు పిల్లలను పాఠాలు మిస్‌ కానివ్వమంటూ ఇప్పటికే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాస్‌లు మొదలెట్టేశాయి. మిగిలిన స్కూళ్లు కూడా త్వరలోనే ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయ్‌.. అన్నీ సిద్ధం చేసుకోండని చెప్పేశాయ్‌. దీంతో ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్లకు డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది. వెబ్‌క్యామ్‌లు, హెడ్‌ఫోన్‌ల ధరలకు రెక్కలొచ్చాయ్‌. ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు జోరందుకున్నాయ్‌. రాష్ట్రవ్యాప్తంగా నెలలోనే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు పుసక్తాలు, యూనిఫాం, స్కూల్‌ బ్యాగుల కోసం లైన్‌ కట్టిన తల్లిదండ్రులు.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు కొనేందుకు ట్రేడ్‌సెంటర్లు, దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. సికింద్రాబాద్‌లోని చినోయ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (సీటీసీ), అమీర్‌పేటలోని ఆదిత్య ట్రేడ్‌ సెంటర్‌ కళకళలాడుతున్నాయి. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. లాక్‌డౌన్‌ ముందుతో పోలిస్తే ఇప్పుడు విక్రయాలు రెట్టింపయ్యాయని హన్మకొండ దుకాణదారు ఒకరు చెప్పారు. ఆన్‌లైన్‌ క్లాసులు తల్లిదండ్రులకు గుదిబండలా మారాయి. అసలే జీతాలు సరిగా రాకపోగా, ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కొనడం కష్టంగా మారింది. ఇంటి కిరాయి కట్టేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పు చేసి ల్యాప్‌టాప్‌లు కొనాల్సి వస్తున్నది.

ఇంటర్నెట్‌ ఇక్కట్లు 

రోజుకు రెండు, మూడు క్లాసులు అవుతుండటంతో మొబైల్‌ డేటా సరిపోక చాలా మంది ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు కనెక్షన్లు తీసుకోండి అంటూ తిరిగిన నెట్‌ వాళ్లు, ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక వారం, పది రోజులకు గానీ కనెక్షన్‌ ఇవ్వలేనంత బిజీ అయిపోయారు. ఫోన్‌ చేస్తే వారం వరకు కుదరదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. డిస్కౌంట్ల మాట దేవుడే ఎరుగాలి. అటు.. వెబ్‌క్యామ్‌లకు కూడా డిమాండ్‌ పెరిగింది. గత ఐదారేళ్లలో వెబ్‌క్యామ్‌ అడిగిన వాళ్లే లేరు. అలాంటిది ఇప్పుడు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. గతేడాది రూ.200 నుంచి రూ.800 వరకు పలికిన వెబ్‌క్యామ్‌ ఇప్పుడు రూ.1400లకు తక్కువ రావడం లేదు. ఇక సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌లు కూడా మార్కెట్‌లో దొరకటం లేదు. ఒకప్పుడు రూ.15వేలు పెడితే మంచి సిస్టమ్‌ వచ్చేది. కానీ, ఇప్పుడు సెకండ్‌హ్యాండ్‌ దొరుకటం గగనంగా మారిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

రోజుకు 15 ల్యాప్‌టాప్‌ల విక్రయం

లాక్‌డౌన్‌కు ముందు రోజూ నాలుగైదు ల్యాప్‌టాప్‌లు అమ్మేవాళ్లం. ఇప్పుడు రోజుకు 10 నుంచి 15 అమ్ముతున్నాం. ఆన్‌లైన్‌ క్లాసెస్‌, వర్క్‌ఫ్రం హోం అంటూ చాలా మంది వస్తున్నారు. మొన్నటి వరకు మా షాపులో విపరీతమైన రద్దీ ఉండేది. రెండు రోజులుగా కాస్త తగ్గింది. 

- కిరణ్‌, సీటీసీ, సికింద్రాబాద్‌

ఆన్‌లైన్‌ క్లాస్‌లు వస్తే చాలు

ల్యాప్‌టాప్‌లు కొంటున్నవారిలో చాలా మంది ఆన్‌లైన్‌ క్లాసులు వస్తే చాలని అడుగుతున్నారు. దీంతో సెకండ్‌హ్యాండ్‌లో రూ.15వేలలో క్లాసులు వినేందుకు సరిపోయే ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా అమ్ముతున్నా. అంతకుముందు వారానికి రెండు ల్యాపీలు అమ్మితే, ఇప్పుడు నాలుగైదు పోతున్నాయి.

- రాజ్‌కుమార్‌, వరంగల్‌


logo