సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:48

‘దక్కన్‌'పై సీరియస్‌

‘దక్కన్‌'పై సీరియస్‌

  • కరోనా చికిత్సకు అధిక బిల్లు వసూలుపై విచారణకు ఆదేశించిన వైద్యారోగ్యశాఖ
  • 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • కఠిన చర్యలు తీసుకోవాలని ఈటలను కోరిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా చికిత్సల పేరుతో పలు ప్రైవేటు దవాఖానలు సాగిస్తున్న దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నది. హైదరాబాద్‌ సోమాజిగూడలోని దక్కన్‌ దవాఖాన వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించింది. అధిక బిల్లు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. 48 గంటల్లో పూర్తి నివేదికను అందజేయాలని హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని గురువారం ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు. కరోనా చికిత్స తీసుకుంటూ దక్కన్‌ దవాఖానలో ఈ నెల 28న సత్యనారాయణరెడ్డి మరణించారు. 

పదిరోజులకు దవాఖాన యాజమాన్యం రూ.17.5 లక్షల బిల్లు వేసిందని, ఇప్పటికే రూ.8 లక్షలు చెల్లించినా మృతదేహాన్ని ఇవ్వలేదని బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తి డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామని దవాఖానవర్గాలు పీడిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం మీడియా, సోషల్‌మీడియాలో వైరలైంది. వారాల వ్యవధిలోనే కరోనాతో సత్యనారాయణరెడ్డితోపాటు ఆయన భార్య, అన్న కొడుకు కూడా మరణించారు. మరోవైపు, ‘కరోనా పాజిటివ్‌ వచ్చిన నా తల్లిదండ్రులకు ప్రైవేటు దవాఖానలో సరైన చికిత్స అందించలేదు. వారికి కనీస వైద్యం కూడా అందక మృతిచెందారు. 

అన్న కూడా చనిపోయాడు’ అని సత్యనారాయణరెడ్డి కొడుకు రాధేశ్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొనగా.. మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సరైన చికిత్స అందించని, బాధ్యతగా వ్యవహరించని ఆ ప్రైవేటు దవాఖానపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. రాధేశ్‌ కుటుంబంలో జరిగిన విషాదం బాధాకరమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రైవేటు దవాఖానల్లో రోగుల చికిత్స పేరుతో ఇష్టారీతిన అధికంగా బిల్లులు వసూలుచేయడం విచారకరమని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ప్రైవేటు దవాఖానలు ఎక్కువ వసూలు చేస్తుండటంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా ఉన్నారు. 

టారిఫ్‌ ప్రకారమే వైద్య ఖర్చులు: దక్కన్‌ దవాఖాన

తాము టారిఫ్‌ ప్రకారమే బిల్లు వేశామని, మొత్తం రూ.12.04 లక్షల బిల్లు వేస్తే, పేషెంట్‌ బంధువులు రూ.10 లక్షలు చెల్లించారని దక్కన్‌ దవాఖాన సీవోవో అండ్‌ డైరెక్టర్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ లిల్లీ సలీం తెలిపారు. సత్యనారాయణ మరణించిన రోజు రాత్రి ఆయన కుమారుడు రాకపోవటం, కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిన కారణంగా మరుసటి రోజు భౌతికకాయాన్ని అందించామని చెప్పారు. వారి పరిస్థితి దృష్ట్యా బిల్లులో అధిక మొత్తం మినహాయింపు ఇచ్చామని పేర్కొన్నారు.


logo