బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:32:56

దవాఖానల్లో సౌకర్యాలపై లైవ్‌ డ్యాష్‌బోర్డులు

దవాఖానల్లో సౌకర్యాలపై లైవ్‌ డ్యాష్‌బోర్డులు

  • బెడ్లు, రోగుల సంఖ్య ఎప్పటికప్పుడు చెప్పండి: హైకోర్టు 
  • సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేస్తున్నామన్న అడ్వకేట్‌ జనరల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో చికిత్స అందిస్తున్న దవాఖానల్లో సౌకర్యాలపై లైవ్‌ డ్యాష్‌బోర్డులు ఏర్పాటుచేయాలని హైకోర్టు పేర్కొన్నది. చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి? ఎంతమంది రోగులున్నారు? ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలు ప్రత్యక్షంగా తెలియజేసేలా ఈ లైవ్‌ డ్యాష్‌బోర్డులను ఏర్పాటుచేయాలని హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌కు సూచించింది. సౌకర్యాలపై అందుబాటులో ఉన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, తద్వార కరోనా రోగులకు కష్టాలు తప్పుతాయని పేర్కొంటూ కర్నాటి శివగణేశ్‌ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

దవాఖాన వివరాలు తెలియజేసే డ్యాష్‌బోర్డుల ఏర్పాటుపై ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలని ధర్మాసనం ఏజీని కోరింది. ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అన్ని దవాఖానల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలిజేసేలా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసేపనిని అధికారులు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటుచేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. అవసరమైతే ఢిల్లీ ప్రభుత్వ సహాయం తీసుకోవాలని ఏజీకి హైకోర్టు సూచించింది. ఈ అంశంపై అధికారులకు సలహా ఇస్తానని  ఏజీ పేర్కొన్నారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.


logo