మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 18:29:27

స్వచ్ఛ భార‌త్ లో తెలంగాణ హ్యాట్రిక్

స్వచ్ఛ భార‌త్ లో తెలంగాణ హ్యాట్రిక్

హైదరాబాద్ : స్వచ్ఛ భార‌త్ లో తెలంగాణ మ‌రోసారి సత్తా చాటింది. స్వచ్ఛతను సాధించి దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. వ‌రుస‌గా మూడోసారి స్వచ్ఛ భార‌త్ అవార్డుల‌ను ద‌క్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. గ‌త మూడేండ్లుగా వ‌రుస‌గా మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకుంది. కాగా, జిల్లాల కేట‌గిరీలో క‌రీంన‌గ‌ర్ జిల్లా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇదంతా సీఎం కేసీఆర్ చేప‌ట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిష‌న్ భ‌గీర‌థ‌ కార్యక్రమాల విజ‌య ప‌రంప‌ర‌ ఫ‌లిత‌ం.

ఇందుకు కార‌ణ‌మైన సీఎం కేసీఆర్ కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు సాధించిన వాళ్లంద‌రినీ మంత్రి అభినందించారు. ప్రతి ఏటా స్వచ్ఛ భార‌త్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ లు, గ్రామ పంచాయ‌తీల వారీగా అవార్డులు అంద‌జేస్తున్నది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గ‌త ఏడాది మూడు ప్రచారాల‌ను కేంద్రం ప్రారంభించింది.

అందులో 2019, న‌వంబ‌ర్ 1 నుంచి 2020, ఏప్రిల్ 20 వరకు ‘స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్)’ కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలు, గ్రామాలను సమీకరించి వారి కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం-నిర్వహణకు ‘సముదాయిక్ షౌచాలయ అభియాన్ (ఎస్ఎస్ఎ) కార్యక్రమాన్ని, 2020 ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు చెత్త, వ్యర్థాలను తొల‌గించేందుకు గంద‌గీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్ ) కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించింది. 

ఈ మూడు కేట‌గిరీల్లోనూ అద్భుత ఫ‌లితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌ని కేంద్ర ప్రభుత్వ డిడిడబ్ల్యుఎస్ డైరెక్టర్ యుగ‌ల్ జోషీ తెలిపారు. అలాగే జిల్లాల కేట‌గిరీలో మ‌న రాష్ట్రంలోని క‌రీంన‌గ‌ర్ జిల్లాకు మూడో స్థానం ద‌క్కింది. ఈ మేర‌కు యుగ‌ల్ జోషీ, తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ‌కి లేఖ‌ను పంపించారు. కాగా, అక్టోబ‌ర్ 2న స్వచ్ఛ భార‌త్ దివ‌స్ సంద‌ర్భంగా ఈ అవార్డుల‌ను అంద‌జేస్తారు. అవార్డులు రావడానికి కారణమైన అధికారులు, ప్రజాప్రతినిధులందరినీ ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేకంగా అభినందించారు.




logo