గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:19

మా పైసలు మాకివ్వరా?

మా పైసలు మాకివ్వరా?

  • బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
  • పెద్దన్న పాత్ర వదిలి చేతులెత్తేస్తున్న మోదీ సర్కార్‌
  • ఐజీఎస్టీ నిధులను పోరాడి సాధించుకున్న తెలంగాణ
  • నేటి జీఎస్టీ కౌన్సిల్‌లో వాదించనున్న మంత్రి హరీశ్‌

కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ర్టాలకు మార్గదర్శిగా నిలుస్తూ.. న్యాయంగా వాటాలు పంచుతూ.. వివాదాలను పరిష్కరిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలి. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఈ అంశంలో పూర్తిగా  విఫలమవుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలు, ఎన్డీయే, అనుకూల పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై అపారమైన ప్రేమను కురిపిస్తూ.. బీజేపీయేతర రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. ఆ రాష్ర్టాలకు దక్కాల్సిన నిధులు ఇవ్వటంలోనూ పక్షపాతం ప్రదర్శిస్తూ అన్యాయం చేస్తున్నది. కేంద్రం తీరు వల్ల ఆయా రాష్ర్టాలు పోరాటంచేసి హక్కులు సాధించుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాధించుకున్న తెలంగాణ.. పోరాటం చేసి దక్కించుకున్నదే. ఇప్పుడు హక్కుగా దక్కాల్సిన నిధులను కూడా పోరాటం చేసి సాధించుకోవాల్సి వస్తున్నది. మా పైసలు మా హక్కు అని దేశమంతా వినిపించేలా గొంతెత్తి చాటి నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతూ జీఎస్టీ చట్టం కింద వాటికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నది. బీజేపీ వైఖరిని గ్రహించిన తెలంగాణ మరోసారి పోరాటపంథాను ఎంచుకున్నది. మిగతా బీజేపీయేతర రాష్ర్టా లు వెన్నంటి వచ్చాయి. తెలంగాణ నేతృత్వంలోని ఆయా రాష్ర్టాల పోరాటం ఫలితంగా కేంద్రం దిగివచ్చి 2017-18 సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ నిధుల విడుదలకు అంగీకరించింది. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు జీఎస్టీ పరిహారంపైనా తెలంగాణ పోరాడుతున్నది. సోమవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తన వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నది. 

బీజేపీయేతర రాష్ర్టాలపై వివక్ష

2017-18 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి రాష్ర్టాలకు పంచాల్సిన ఐజీఎస్టీ నిధులను కేంద్రం అక్రమంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమచేసింది. సొంతానికి వాడుకున్నది. ఈ మోసాన్ని ముందుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సుమారు రూ.24వేల కోట్ల మేర రాష్ర్టాలకు పంచాల్సి ఉన్నదని కేంద్రానికి గుర్తు చేసింది. అయితే బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఇతర రూపాల్లో అధికంగా నిధుల వరదను పారించటంతో ఆ రాష్ర్టాలు కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఈ వివక్షపై తెలంగాణ ఒంటరిగా పోరాటాన్ని ప్రారంభించింది.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం వాస్తవాలను లెక్కలతో సహా వివరించింది. 2017-18కి సం బంధించి కేంద్రం కొన్ని రాష్ర్టాలకు ఐజీఎస్టీని అధికంగా చెల్లించిందని, వాటిని రికవరీ చేయాలని ఐజీఎస్టీ సెటిల్మెంట్‌పై ఏర్పాటైన గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సూచించింది. ఆ జాబితాలో బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి. ఇందులో పంజాబ్‌ మినహా మిగతావన్నీ బీజేపీ లేదా ఎన్డీయే పాలిత రాష్ర్టాలే కావడం గమనార్హం. రాష్ర్టాలపై కేంద్రం వివక్షకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. దీంతో ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, తమిళనా డు వంటి రాష్ర్టాలు తెలంగాణకు మద్దతు పలికాయి. సుమారు రెండేండ్ల పోరాటం ఫలితంగా కేంద్రం దిగివచ్చింది. 2017-18 నిధులను విడుదల చేస్తామని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. 

జీఎస్టీ పరిహారంపైనా సాగదీత 

ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ర్టాలకు హక్కుగా రావాల్సిన రూ.2.6 లక్షల కోట్లపై కేంద్రం అదే మొండివైఖరిని ప్రదర్శిస్తున్నది. అప్పుల రూపంలో రాష్ర్టాల నెత్తిన మోయలేని భారాన్ని మోపాలని కుట్రచేస్తున్నది. ఈ అన్యాయంపై తెలంగాణ గళమెత్తి పోరాడుతున్నది. బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన 20కిపైగా రాష్ర్టాలు కేంద్రం ఆప్షన్‌కు ఒప్పుకొన్నా.. తెలంగాణ మాత్రం నో ఆప్షన్‌ అంటూ తెగేసి చెప్పింది. మొత్తం సొమ్మును కేంద్రమే అప్పుగా తీసుకొని చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది. గతవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లోనూ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బలంగా పోరాడటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావే శం వాయిదాపడింది. సోమవారం మరోసారి కౌన్సిల్‌ సమావేశం జరుగనున్నది. ఈసారి సైతం తన వాదనను బలంగా వినిపించేందుకు హరీశ్‌రావు సిద్ధమవుతున్నారు.


logo