మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 10:32:46

ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నాం : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నాం : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నామ‌ని వ్య‌వసాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ రంగం ద్వారా వ‌చ్చే ఉపాధి అవ‌కాశాలు, స్థూల ఆదాయంతో రాష్ర్టానికి ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్ ఉంటుంది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు కోటి 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు సాగు అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల వ‌రి నాట్లు వేస్తున్నారు. ఈ సాగు విస్తీర్ణం ఏటేటా పెరిగిపోతోంది. కేంద్రం సేక‌రించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ నుంచి 55 శాతం ధాన్యం కొనుగోలు చేసింది. అయితే పంట‌ల మార్పిడి జ‌ర‌గాల్సిన అస‌వ‌రం ఉంది. పంట‌ల మార్పిడి జ‌ర‌గ‌క‌పోతే దిగుబ‌డి త‌గ్గుతుంద‌న్నారు.

మార్కెట్ విధానం దృష్టిలో ఉంచుకుని పంట‌ల‌ను సాగు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పంట‌ల నియంత్రిత సాగును ఈ ఏడాది శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్‌. ఈ ఏడాది కందులు, వ‌రికి ప్రాధాన్య‌త ఇచ్చారు. నూత‌న పంట‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. భిన్న‌మైన పంట‌ల వైపు వ్య‌వ‌సాయ శాఖ సూచిస్తుంది. దేశంలో నూనె గింజ‌ల ఉత్ప‌త్తి ప‌డిపోయింది. ప్ర‌త్యేకంగా వంట నూనెల వాడ‌కం భ‌విష్య‌త్‌లో పెర‌గ‌నుంది. కేంద్రం ఈ ప్ర‌మాదాన్ని గుర్తించి.. విదేశాల నుంచి వంట నూనెల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం మూలంగా అద‌నంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తద‌ని గ్ర‌హించి.. వంట నూనెల పంట‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. పామాయిల్ దిగుమతికి 40 వేల కోట్లు కేంద్రం వెచ్చిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 18 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ఆయిల్ ఫామ్‌ను సాగు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

ఈ ప్ర‌తిపాద‌న కంటే ముందే తెలంగాణ‌లో ఆయిల్ ఫామ్ సాగును విస్త‌రించాల‌ని ప్ర‌భుత్వం చ‌ర్య‌లను ముమ్మ‌రం చేసింది. రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఆయిల్ ఫామ్ సాగుపై చ‌ర్యలు చేప‌ట్టామ‌న్నారు. తెలంగాణ‌లో 25 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. జాతీయ ఆహార భ‌ద్ర‌త మిష‌న్ ఆయిల్ ఫామ్ ప‌థ‌కం కింద 2,500 హెక్టార్ల‌లో ఈ సంవ‌త్స‌రం సాగు చేయ‌డం జ‌రిగింది. ఆయిల్ ఫామ్ సాగు కోసం 25 జిల్లాల్లో 3,29,000 హెక్టార్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆయిల్ ఫామ్ చేప‌ట్టేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలో రాష్ర్టంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. 


logo