శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 21, 2021 , 01:31:34

ధరణిలో కొత్త ఆప్షన్‌

ధరణిలో కొత్త ఆప్షన్‌

భూసమస్య ఏదైనా దరఖాస్తుకు అవకాశం.. కలెక్టర్లకు పరిష్కార బాధ్యత వ్యవసాయ భూములపై ఎలాంటి సమస్యలున్నా దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సరిహద్దు వివాదాలు, విస్తీర్ణం తప్పుగా నమోదుకావడం, పట్టాదార్‌ పాస్‌బుక్‌ మంజూరు కాకపోవడం.. ఇలా ఎలాంటి సమస్య అయినా ఉన్నతాధికారులకు విన్నవించుకోవచ్చు. ఇందుకోసం ధరణిలో ప్రత్యేకంగా ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది.

హైదరాబాద్‌, జనవరి 20 (నమస్తే తెలంగాణ):  రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అత్యధికశాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. పేర్లల్లో అక్షరదోషాలు, విస్తీర్ణం నమోదులో తేడాలు, వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి కొన్ని సమస్యలు మిగిలిపోయాయి. తాజాగా వీటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి తొలిగించడం, కంపెనీల భూముల రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని అంశాలపై మీసేవ ద్వారా దరఖాస్తుకు అవకాశమిచ్చింది. తాజాగా ధరణిలో ‘అప్లికేషన్‌ ఫర్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌' పేరుతో కొత్త ఆప్షన్‌ను జతచేసింది. వినియోగదారులు ‘యూజర్‌ లాగిన్‌'లోకి వెళ్లిన తర్వాత డ్యాష్‌బోర్డులో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేరు, అడ్రస్‌వంటి వివరాలు నమోదుచేశాక.. దరఖాస్తు చేయాలనుకున్న భూమి సర్వేనంబర్‌ను నమోదుచేయాలి. అనంతరం అక్కడ కనిపించే సరిహద్దు వివాదం, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, ఇతర, పట్టాదార్‌ పాస్‌బుక్‌ (పీపీబీ)ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్యకు సంబంధించిన వివరణను కింద బాక్స్‌లో రాయాలి. చివరగా ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్‌లోడ్‌ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తుంది. కలెక్టర్‌ వాటిని పరిశీలించి.. అవసరమైతే విచారణ జరిపి వారంలో పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.


VIDEOS

logo