శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 15:57:51

విద్యార్థుల‌కు డిజిట‌ల్ పాఠాలు.. కేటీఆర్ ట్వీట్

విద్యార్థుల‌కు డిజిట‌ల్ పాఠాలు.. కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని అన్ని పాఠశాలల్లో మంగళవారం ఉద‌యం నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభ‌మ‌య్యాయి. మంగ‌ళ‌వారం ఉదయం 7.45 గంటలకు రామంతపూర్‌లోని దూరదర్శన్‌ కేంద్రం లో డిజిటల్‌ బోధన ప్రసారాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి.. ఆన్‌లైన్ విద్య‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం టీ శాట్ నెట్‌వ‌ర్క్ ద్వారా స్కూల్ విద్యార్థుల‌కు కొత్త అభ్యాస ప్ర‌క్రియ‌ను అందుబాటులోకి తీసుకొచ్చింద‌న్నారు. విద్యా ఛానెల్ ద్వారా 3 నుంచి 10వ తర‌గ‌తి విద్యార్థుల‌కు డిజిట‌ల్ పాఠాల‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించిన‌ట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. 

టీ శాట్ ఛానెల్స్.. కేబుల్ నెట్‌వ‌ర్క్‌, డీటీహెచ్, వైర్, వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయ‌న్నారు. ఈ ఛానెల్స్ ద్వారా విద్యార్థులు పాఠాల‌ను వినాల‌ని చెప్పారు. టీ శాట్ యాప్‌ను ఇప్ప‌టికే 4 ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, యూట్యూబ్ ఛానెల్స్ కు 4.3 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్కైబ‌ర్స్ ఉన్నార‌ని కేటీఆర్ తెలిపారు. 

ఆన్‌లైన్‌లో బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు ఆగస్టు 27 నుంచి టీచర్లు విధులకు హాజరవుతున్నారు. టీవీలు ఉన్న, టీవీలు లేని విద్యార్థులను విభజించారు. టీవీలు లేని విద్యార్థుల కోసం స్కూల్‌ పాయింట్స్‌, గ్రామాలవారీగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. రాష్ట్రంలో దాదాపు 92% మంది ఇండ్లలో టీవీలు ఉన్నాయని విద్యాశా ఖ సర్వేలో తేలింది. టీవీలు లేని 8% మందికి పాఠాలు బోధించేందుకు ప్రత్యామ్నాయ వేదికలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ పాఠాలపై విద్యాశాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తెలియపరుస్తున్నారు. డిజిటల్‌ పాఠాలు బోధించాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. 


logo