మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 03:22:02

కరోనా కట్టడిలో మనమే భేష్‌!

కరోనా కట్టడిలో మనమే భేష్‌!

  • భారత్‌ నిబద్ధత ప్రశంసనీయం : డబ్ల్యూహెచ్‌వో
  • నివారణే ధ్యేయంగా తెలంగాణ కఠినచర్యలు

మన దేశంలో కరోనా తొలి కేసు నమోదుకు.. మొదటి మరణానికి మధ్య వ్యవధి 42 రోజులు.. అమెరికాలో ఇది 39 రోజులు.. చైనాలో 10 రోజులు..ఇరాన్‌లో తొలికేసు నమోదైన రోజే తొలి మరణం కూడా..వైరస్‌ ఉనికి తెలిసిన 47 రోజుల్లో ఇటలీలో 2,158 మరణాలు..  అదే సమయంలో భారత్‌లో మూడు మరణాలు మాత్రమే నమోదు!

దేన్నైనా జయించగలమని గొప్పలు చెప్పుకొనే చైనా.. అమెరికా.. యూరప్‌ దేశాలు.. ఇప్పుడు ఒక మహాభూతానికి గడగడలాడుతున్నాయి.  అనేక దేశాల్లో రోగం ఉన్నదని తేలేలోగానే మరణం సంభవిస్తున్నది.  ఒకే ఒక్క దేశం.. 130 కోట్ల జనాభా.. భౌగోళికంగా విశాలం, సంక్లిష్టమైన భారతదేశం విజయవంతంగా వైరస్‌ను అడ్డుకొంటున్నది. ఇది ఎవరో అన్నమాటలు కావు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్యసంస్థ  ప్రశంసలు. కరోనా నియంత్రణలో భారత్‌ నిబద్ధత అద్భుతమని కొనియాడింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకొంటున్న కఠిన చర్యలు.. కొవిడ్‌ -19 వ్యాప్తిని పకడ్బందీగా కట్టడి చేస్తున్నాయి.

నేషనల్‌ డెస్క్‌:చైనాలో తొలి కరోనా కేసు అధికారికంగా గతేడాది డిసెంబర్‌ 31న నమోదవ్వగా.. తొలి మరణం పదిరోజుల తేడాలోనే (జనవరి 9)న రికార్డయింది. ఈ పరిస్థితులను భారత్‌తో పోల్చిచూస్తే.. దేశంలో తొలి కరోనాకేసు జనవరి 30న నమోదవ్వగా.. తొలి మరణం మార్చి 12న నమోదైంది. తొలి కేసును గుర్తించిన తర్వాత.. తొలి మరణం సంభవించడానికి అత్యధికంగా 42 రోజుల సమయం పట్టింది. అప్పటివరకు రోగిని రక్షించడంలో మన వైద్యులు విజయం సాధించారు. ఆ వ్యక్తి వయోవృద్ధుడు కావడం, ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం కూడా అతడి మరణానికి కారణమైంది. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న మరే ఇతర దేశంలో(చైనా, ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌, అమెరికా సహా) మొదటి కేసును గుర్తించిన తేదీకి, తొలి మరణం నమోదైన తేదీకి ఇంత వ్యవధి లేదు. తొలికేసు గుర్తించిన తేదీకి, తొలి మరణం నమోదైన తేదీకి మధ్య ఎక్కువ సమ2యం ఉందంటే.. వైరస్‌ను కట్టడి చేయడంలో, వ్యాధిసోకిన బాధితులకు చికిత్సను అందించడంలో అధికారులు అప్రమత్తతతో ఉన్నట్టు అర్థమని నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి వైరస్‌ సోకిన వాళ్లకు అందిస్తున్న చికిత్స పద్ధతుల్లో మిగతా దేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉన్నట్టు అర్థమవుతున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 137గా ఉన్నది. మరోవైపు, చైనాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,226కు చేరగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 80,881గా ఉన్నది. 

కరోనా గుర్తించినరోజే మరణం

ఇరాన్‌లో ఫిబ్రవరి 19న రెండు కరోనా కేసులను గుర్తించారు. అదేరోజు ఆ ఇద్దరూ మరణించారు. కొవిడ్‌ వల్ల చైనా తర్వాత తీవ్ర ప్రభావానికి గురైన ఇటలీలో తొలి కరోనా కేసు జనవరి 31న నమోదవ్వగా.. ఫిబ్రవరి 21న తొలి మరణం రికాైర్డెంది. వీటిమధ్య అంతరం 22 రోజులుగా ఉన్నది. ఆ తర్వాత ఆ దేశంలో అత్యంత వేగంగా కొవిడ్‌ విస్తరించింది. దీంతో ఇప్పటివరకు ఇటలీలో 2,158 మంది మరణించారు. 27,980 మందికి వైరస్‌ సోకి బాధపడుతున్నారు. ఇరాన్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 988కు చేరగా, నమోదైన కేసుల సంఖ్య 16,169గా ఉన్నది. స్పెయిన్‌లో తొలి కరోనా కేసు జనవరి 31న, తొలి మరణం ఫిబ్రవరి 13న నమోదయ్యాయి. ఇక్కడ పద్నాలుగు రోజులపాటు రోగిని కాపాడగలిగారు. ఇప్పుడు స్పెయిన్‌లో కరోనా మృతులు 509కు చేరగా, వైరస్‌ సోకిన కేసుల సంఖ్య 11,409గా ఉన్నది. ఇటలీ, స్పెయిన్‌లో ఒకే రోజున(జనవరి 31) కరోనా తొలి కేసులు గుర్తించినప్పటికీ, మరణాల తేదీల్లో సుమారు 8 రోజుల వ్యత్యాసం ఉన్నది. అగ్రరాజ్యం అమెరికాలో తొలి కరోనా కేసు జనవరి 31న నమోదవ్వగా.. తొలి మరణం ఫిబ్రవరి 29న సంభవించింది. తొలి కేసు గుర్తించడానికి.. తొలి మరణానికి అమెరికాలో 39 రోజుల అంతరం నమోదైంది. ప్రస్తుతం ఆ దేశంలో కొవిడ్‌-19తో 93 మంది చనిపోగా.. 4,752 కేసులు నమోదయ్యాయి.  


భారత్‌ నిబద్ధత ఆకట్టుకున్నది: డబ్ల్యూహెచ్‌వో

కరోనాపై పోరాటంలో భాగంగా భారత్‌ చూపుతున్న నిబద్ధత ఎంతో ఆకట్టుకున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌)తో సమావేశం అనంతరం భారత్‌కు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధిగా ఉన్న హెంక్‌ బెకెడవ్‌ు మీడియాతో మాట్లాడారు. ‘కరోనాపై పోరాడేందుకు భారత్‌లో అధికారులు నిబద్ధతతో చర్యలు చేపడుతున్నారు. ఇవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దేశంలో వైరస్‌ తీవ్రత ఇంతగా ఉన్నప్పటికీ భారత్‌ ధృఢంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం. వైరస్‌పై ప్రతి ఒక్కరి నుంచి ఈ స్థాయిలో స్పందన రావడం ఎంతో ఆకర్షించింది. భారత్‌లో ఐసీఎంఆర్‌ వంటి సంస్థల్లో పరిశోధనలకు అనువైన సదుపాయాలు ఉన్నాయి. వైరస్‌ను ఎదుర్కొనగల సామర్థ్యం వారికి ఉన్నది’ అని హెంక్‌ పేర్కొన్నారు.  

రెండో దశలోనే..

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి రెండో దశ (లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌)లో ఉన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ చెప్పారు. ఈ మహమ్మారి నాలుగు దశల్లో ఉంటుందన్నారు. మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అని, అంతర్జాతీయ సరిహద్దులను కట్టుదిట్టంగా మూసివేయడంతో ఈ దశ దేశంలోకి ప్రస్తుతానికి ప్రవేశించబోదని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు.  కొవిడ్‌-19 కేసుల పరీక్షల నిర్వహణకు జాతీయ ప్రయోగశాలల గుర్తింపు మండలి (ఎన్‌ఏబీఎల్‌) గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీలతో సంప్రదింపుల ప్రక్రియ జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 72 ఐసీఎంఆర్‌ ల్యాబొరేటరీలు పని చేస్తున్నాయని, మరొక 49 ల్యాబొరేటరీలను ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

కరోనా వివిధ దశలు..

తొలి దశ: ఈ దశలో వైరస్‌ సోకిన వారిని గుర్తించి కేసుల్ని నమోదు చేస్తారు. బాధితులు ఇతరులతో కలువకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

రెండో దశ (లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌): కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల్లో ప్రయాణం చేసి, స్వదేశానికి వచ్చినవారికి వైరస్‌ సోకితే, లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. 

మూడో దశ (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌):  వైరస్‌ బాధితునితో కలవకపోయినా, కరోనా వైరస్‌ బాధిత దేశంలో ప్రయాణించకపోయినా ఒక వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లయితే.. ఆ దశను కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. ఈ దశ ప్రస్తుతం ఇరాన్‌, దక్షిణ కొరియా, అమెరికా, ఐరోపాలోని పలు దేశాల్లో ఉన్నది.

నాలుగో దశ: ఈ దశలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ, అంటు వ్యాధిగా మారుతుంది. ప్రస్తుతం చైనాలో ఈ దశ ఉన్నది. 

తెలంగాణలో కట్టుదిట్టం

దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లో కొవిడ్‌-19 విస్తరించగా.. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే కట్టడిచర్యలు చేపట్టింది. విమాన, రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పరీక్షించి కరోనా వ్యాప్తిని కట్టుదిట్టంగా అడ్డుకొంటున్నది.రూ.500 కోట్ల నిధులను విడుదలచేసి వైరస్‌ నిరోధానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటున్నది.  పలుచోట్ల క్వారంటైన్‌ కేంద్రాలు, పదమూడు వందలకు పైగా ఐసొలేషన్‌ బెడ్స్‌, ఆరు వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌లతో పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జనసమ్మర్ధాన్ని నిలువరించడానికి పదిహేనురోజులపాటు పాఠశాలలు, సినిమాహాళ్లు, అమ్యూజ్‌మెంట్‌పార్కులు మూసివేసింది. ఇప్పటివరకు 66 వేలమందికి పైగా స్క్రీనింగ్‌ నిర్వహించగా కేవలం ఐదుగురికే కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు చికిత్స ద్వారా వ్యాధి నయంచేయించుకొని డిశ్చార్జి కాగా.. మిగిలిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి మెరుగుపడింది. 

కరోనా డైరీ

ఓటేసినప్పుడు వేలికి సిరా రాస్తారు! నెలపాటు ఆ గుర్తు అలానే ఉండిపోతుంది! కరోనా అనుమానితుల గుర్తింపు  విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే చిట్కాను పాటిస్తున్నది!  ‘ హోం 

క్వారంటైన్‌డ్‌' అని రాసి ఉన్న ముద్రను వారి చేతిపై వేస్తున్నది. కరోనా లక్షణాలున్నవారు బయట తిరుగకుండా.. తిరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా ఈ చర్య తీసుకున్నది. 


కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు భారత రైల్వే దేశవ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను పెంచింది. రూ. 10 నుంచి పెద్ద స్టేషన్లలో రూ. 50,  చిన్న స్టేషన్లలో రూ. 20 చేసింది.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేశారు. 

భద్రాద్రిలో ప్రతిఏడాది వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణం కరోనా వైరస్‌ కారణంగా ఈసారి నిరాడంబరంగా జరుగనున్నది. శ్రీరామనవమి వేడుకను  మిథిలా స్టేడియంలో బదులు ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు.కరోనా వ్యాధికి  ఔషధాన్ని కనుగొనేందుకు ఐఐసీటీ, ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా చేతులు కలిపాయి.  రెమ్‌డెసివిర్‌, ఫేవిపిరావిర్‌తోపాటు బొలాక్సావిర్‌ డ్రగ్‌ను కూడా తయారుచేయాలని సిప్లా చైర్మన్‌ వైకే హమీద్‌ తమను కోరారని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌  తెలిపారు.కరోనా దెబ్బతో పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకు రుణాలకు వడ్డీలు చెల్లించలేకపోతున్నారు. రుణాల  ఈఎంఐ చెల్లింపునకు కేంద్రం రెండునెలలు వెసులుబాటు కల్పించాలి.  

- ప్రధాని మోదీకి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ లేఖ


దేశం
తొలి కేసు నమోదైన రోజు
తొలి మరణానికి పట్టిన వ్యవధి
తొలి కేసును గుర్తించి నేటికి(బుధవారానికి) 
ప్రస్తుతం మరణాలు 
మొత్తం కేసులు
చైనా
31.12.2019
10 రోజులు
78 రోజులు
3,226
80,881
ఇటలీ
31.01.2020
22 రోజులు
47 రోజులు
2,158
27,980
ఇరాన్‌
19.02.2020
అదేరోజు
28 రోజులు
988
16,169
స్పెయిన్‌
31.01.2020
14 రోజులు
47 రోజులు
509
11,409
అమెరికా
21.01.2020
39 రోజులు
57 రోజులు
93
4,751
భారత్‌
30.01.2020
42 రోజులు
48 రోజులు
03
137
logo
>>>>>>