శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:40

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

  • ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు
  • జడ్చర్ల జూనియర్‌ కాలేజీకి కొత్త భవనం
  • అన్ని డిగ్రీ కాలేజీల్లో గార్డెన్ల అభివృద్ధి
  • జడ్చర్ల కాలేజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
  • గార్డెన్‌ అభివృద్ధికి 50 లక్షలు మంజూరు
  • బోటనీ లెక్చరర్లతో త్వరలో సమావేశం
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్‌ పెరిగిపోతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్‌ గార్డెన్‌ 

అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్‌ రఘురాం తమ సొంత ఖర్చులతో జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న సమాచారాన్ని తెలుసుకున్న సీఎం.. వారిని అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. లెక్చరర్‌ రఘురాం విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి నూతన భవనాన్ని కూడా సీఎం మంజూరు చేశారు.

జడ్చర్ల కాలేజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధరకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో గార్డెన్‌ను అభివృద్ధిచేసి, అక్కడే తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు కృషిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్య శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. సదాశివయ్య కృషిని సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా.. తెలంగాణకు మాత్రమే సొంతమైన, నల్లమల అడవుల్లో పెరిగే అండ్రోగాఫిన్‌ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదాశివయ్య బహూకరించారు. సదాశివయ్య సేవా నిరతిని సీఎం కొనియాడారు. జడ్చర్లలో ఏర్పాటుచేసే బొటానికల్‌ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరుచేశారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న బోటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటుచేసి, వారి ఆధ్వర్యంలో వివిధరకాల మొక్కలతో గార్డెన్లు అభివృద్ధి చేసే కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనంపై హర్షాతిరేకాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూటీఎస్‌ నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావ రవి, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, జూనియర్‌ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, సంఘం నాయకులు శేఖర్‌, కడారి శ్రీనివాస్‌, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు కొప్పిశెట్టి సురేశ్‌, ఆర్జేడీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న, తల్లిదండ్రుల సంఘం నాయకులు నాగటి నారాయణ, పడాల లక్ష్మయ్య తదితరులు సంతోషం వ్యక్తంచేశారు.


logo