బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 11:23:03

న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి ఈట‌ల‌

న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్ : రాష్ర్టంలో న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈట‌ల స‌మాధానం ఇచ్చారు. 2018 సంవ‌త్స‌రంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించిన మదింపులో న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందించ‌డంలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది అని తెలిపారు. రాష్ర్టంలో న‌వ‌జాత శిశువు మ‌ర‌ణాల రేటు 19గా ఉంది. ఇది జాతీయ స‌గ‌టు అయిన 22 కంటే త‌క్కువ‌. రాష్ర్టంలో న‌వ‌జాత శిశు సంర‌క్షణ యూనిట్ల విష‌యానికి వ‌స్తే ప్ర‌త్యేక న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ యూనిట్లు 29, న్యూబార్న్ స్టెబిలైజేష‌న్ యూనిట్లు 46, న్యూబార్న్ కేఫ్ కార్న‌ర్లు 562 ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుత‌మున్న 29 ప్ర‌త్యేక‌ న‌వ‌జాత శిశువు సంర‌క్ష‌ణ యూనిట్ల‌ను అద‌నంగా మ‌రో 11 యూనిట్లను, రెండు మాతా న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ యూనిట్ల‌ను మంజూరు చేశామ‌న్నారు. ఈ యూనిట్ల‌ను నిర్వ‌హ‌ణ‌లోకి తీసుకువ‌చ్చే ప‌ని పురోగ‌తిలో ఉంద‌న్నారు. 

ఆరోగ్య రంగంపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ర్టంలో ఇప్ప‌టికే ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేస్తున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం వ‌చ్చిన త‌ర్వాత బాల్య‌వివాహాల‌ను అరిక‌ట్ట‌గ‌లిగామ‌ని తెలిపారు. పౌష్టికాహారం లోపం వ‌ల్లే బ‌రువు త‌క్కువ ఉన్న పిల్ల‌లు పుడుతున్నారు. దీన్ని అధిగ‌మించేందుకు ఆరోగ్య‌ల‌క్ష్మి ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామ‌ని చెప్పారు. న‌వ‌జాత శిశువుల విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. 


logo