శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 02:05:27

వలసకూలీకి బతుకు భరోసా

వలసకూలీకి బతుకు భరోసా

  • ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం.. 500 నగదు అందజేత 
  • సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్న వలస కూలీలు
  • తెలంగాణలోనే పనిచేస్తామని వెల్లడి

ఎక్కడినుంచో వచ్చారు! ఇక్కడి భాష అసలే రాదు! ఓ వైపు లాక్‌డౌన్‌తో పనుల్లేవ్‌! మరోవైపు ఆకలి తీరే మార్గాల్లేవ్‌! రాష్ట్రంకాని రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు సీఎం కేసీఆర్‌ రూపంలో ఓ భరోసా! ఒక్కొక్కరికి రూ.500, పన్నెండు కిలోల బియ్యం పంపిణీ వారిలో అంతులేని ఆనందాన్ని నింపింది.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం.. వలస కూలీలను గుర్తించి బియ్యం, నగదు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం మొదలైన బియ్యం పంపిణీ మంగళవారం ఊపందుకున్నది. రాష్ట్ర డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్లుగా తమను సీఎం కేసీఆర్‌ భావించడాన్ని ఊహించలేదని, ఎప్పటికీ పనులు ఇక్కడే చేయాలనే ఉత్సాహం కలుగుతున్నదని కూలీలు పేర్కొన్నారు. దేశమంతా స్తంభించినా మాకేం కాదనే భరోసా కలిగిందని సంతోషపడ్డారు. ఆపత్కాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. 

మెదక్‌ జిల్లాలో 2,500 మంది వలస కూలీలను గుర్తించగా, మంగళవారంనాటికి 600 మందికి 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున నగదు పంపిణీచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 21,621 మంది వలస కార్మికులు ఉన్నట్టు లెక్కతేల్చారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించేందుకు జిల్లాకు రూ.1,08,12,000 విడుదలయ్యాయి. చౌటుప్పల్‌ డివిజన్‌లో మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, భువనగిరి డివిజన్‌లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల పరిధిలో 4,998 మంది వలస కార్మికులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం వరకు 247 మందికి 2,964 కిలోల బియ్యం, రూ.1లక్షా 23వేల 530 నగదును అధికారులు అందజేశారు. కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లాలో 2,482 మంది వలస కూలీలు ఉన్నట్టు గుర్తించారు. 

ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున 29.78 టన్నుల బియ్యం, రూ.500 చొప్పున రూ.12.41 లక్షలు అందించారు. మంచిర్యాల జిల్లాలో 3,836 మంది వలసకూలీలు ఉండగా, మంగళవారంనాటికి 1,791 మందికి బియ్యం, నగదు పంపిణీచేశారు. ఇప్పటివరకు నగదు రూపంలో రూ.8,95,500, 12 కిలోల బియ్యం చొప్పున 214.92 క్వింటాళ్ల బియ్యం అందించారు. నల్లగొండ జిల్లాలో 15,925 మంది వలస కార్మికులను గుర్తించారు. 1,911 క్వింటాళ్ల(రూ.63 లక్షల విలువైన) బియ్యం, రూ.80 లక్షల నగదు, సూర్యాపేట జిల్లాలో 4,379 మందికి 526 క్వింటాళ్ల (17.31 లక్షల విలువైన) బియ్యం, రూ.21,89 లక్షల నగదు అందజేశారు. కరీంనగర్‌ జిల్లాలో 14,355 మంది వలస కార్మికులను గుర్తించారు. మంగళవారం 5,064 మందికి 60,408 కిలోల బియ్యం, రూ.25,32,000 పంపిణీ చేశారు. 

ఖమ్మం జిల్లావ్యాప్తంగా 26,243 మంది వలస కూలీలను గుర్తించారు. వీరికి 314.916 టన్నుల బియ్యం, రూ.1,31,21,500 నగదు అందజేశారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో వలస కూలీలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బియ్యం, నగదు పంపిణీచేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో 1,710 మంది కూలీలకు మంగళవారం జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ కోయగూడెం పాఠశాలలో 1,710 మందికి 20, 520 కిలోల బియ్యం, రూ.8,55,000 పంపిణీ చేశారు.

అండగా ప్రభుత్వం: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ ప్రాంతాల్లో వలస కూలీలకు బియ్యం, రూ.500 చొప్పున మంత్రి మల్లారెడ్డి పంపిణీచేశారు. పునరావాస కేంద్రాల్లోని కార్మికులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 11,061 మంది వలస కార్మికులు ఉన్నట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీరికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతోపాటు రూ.500 ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. మంగళవారంనాటికి 8,600 మందికి బియ్యం, ఆర్థికసాయాన్ని అం దజేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 6,612 మంది వలసకూలీలను గుర్తించారు. 1,170 మందికి మంగళవారంవరకు 140.40 క్వింటాళ్ల బియ్యం, రూ.5.85 లక్షలను పంపిణీచేశారు. నిర్మల్‌ జిల్లాలో 6,011 మంది వలస కార్మికులున్నట్టు గుర్తించి 12 కిలోల చొప్పున బియ్యం, నగదు పంపిణీచేశారు. ములుగు జిల్లాలో 2,082 మంది వలస కూలీలకు 249.84 క్వింటాళ్ల బియ్యం, రూ.10.42 లక్షల నగదు పంపిణీ చేశారు.

మహబూబాబాద్‌ జిల్లాలో 4,826 మంది కూలీలకు 574 క్వింటాళ్ల బియ్యం, రూ.24,13,000 నగదు అందజేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 747 మంది వలస కూలీల గుర్తించి ఒక్కొకరికి 89.64 క్వింటాళ్ల బియ్యం, రూ.3,73,500 నగదు ఇచ్చారు. జిల్లాలోని వలస కూలీల్లో ఎక్కువమంది పరకాల ము న్సిపాలిటీ పరిధిలో ఉన్నారని కలెక్టర్‌ హరిత తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 4,007 మందికి జిల్లావ్యాప్తంగా కలెక్టర్‌ అబ్దుల్‌అజీమ్‌ ఆధ్వర్యంలో బి య్యం, నగదు అందజేశారు. 480.84 క్వింటాళ్ల బియ్యం, రూ.20,03,500 నగదు అందజేశారు. జనగామ జిల్లాలో 2,445 మందికి 293.40 క్వింటాళ్ల బియ్యం, రూ.12.22 లక్షలు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 9,646 మందికి 1157.52 క్వింటాళ్ల బియ్యం, రూ.48.23 లక్షల నగదు అందజేశారు.


logo