గురువారం 02 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:24:35

పాడి రైతుకు ప్రత్యేక రుణం

పాడి రైతుకు ప్రత్యేక రుణం

  • జూలై 31 దాకా కిసాన్‌ క్రెడిట్‌కార్డులు 
  • గరిష్ఠంగా రూ.3 లక్షల రుణం
  • రాష్ట్రంలో 3 లక్షల మందికి లబ్ధి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఆర్థికంగా కుదేలైన పాడి రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందించనున్నది. వీటి ద్వారా పాడి రైతులు నేరుగా బ్యాంకు నుంచి రూ.లక్షా 60 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి జూలై 31 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు సంబంధిత పాడి సొసైటీల్లో అందించవచ్చునని పశుసంవర్థకశాఖ పేర్కొన్నది. 

రాష్ట్రంలో విజయడెయిరీతో కలిపి దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులు ఉన్నారు. పాల ఉత్పత్తి సహకార సంఘాలు, వివిధ యూనియన్లలో సభ్యులుగా ఉండి కిసాన్‌ క్రెడిట్‌కార్డులు లేని రైతులను గుర్తించి, వారందరికీ జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. భూయాజమాన్యం ఆధారంగా ఇప్పటికే క్రెడిట్‌కార్డులు పొందిన రైతులకు పరపతి పరిధిని పెంచుతారు. వడ్డీ మాఫీ వెసులుబాటు మాత్రం రూ.3 లక్షల వరకే వర్తిస్తుంది. రైతుల నుంచి ఎలాంటి భరోసా తీసుకోని రుణ పరిమితి రూ.1.6 లక్షలు మాత్రమే ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం లీటరుకు రూ.4 ప్రోత్సాహకాన్ని, 50 శాతం సబ్పిడీపై పాడి పశువులను అందజేస్తుంది. తాజాగా జారీ చేసే క్రెడిట్‌కార్డులతో మరింత సాంత్వన చేకూరనున్నది. 


logo