శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:46:15

బియ్యం పంపిణీకి సిద్ధం

బియ్యం పంపిణీకి సిద్ధం

  • రేషన్‌ షాపులకు సరఫరాపై ప్రణాళిక
  • పౌరసరఫరాలశాఖ ఆదేశాలు జారీ
  • ఈ-కుబేర్‌ ద్వారా 1500 నగదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 31 వరకు రోజుకూలీలు, పేదలు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా తెల్లరేషన్‌కార్డుదారుల్లో ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమై రేషన్‌ బియ్యాన్ని రేషన్‌దుకాణాలకు ఎలా చేరవేయాలి అనే అంశంపై మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో 87.53 లక్షల తెల్ల రేషన్‌కార్డులుండగా, 2.72 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 

తాజాగా ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాల్సి ఉండటంతో ఆ మేరకు గోదాముల నుంచి రేషన్‌షాపులకు సరఫరా చేయడానికి రెట్టింపు వాహనాలు సమకూర్చుకోవాలని స్టేజ్‌-1, స్టేజ్‌-2 కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ మారెడ్డి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సమయంలో పేదలెవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ 12 కిలోల బియ్యం సరఫరాచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పౌరసరఫరాల సంస్థ వద్ద బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు బియ్యం పంపిణీతోపాటు, సరుకుల కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన రూ.1500 నగదును ఈ-కుబేర్‌ ద్వారా అందించాలని నిర్ణయించారు. 

సేవలకు సిద్ధం: పెట్రో డీలర్లు

సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. అయితే తమ సిబ్బంది సంక్షేమం గురించి పట్టించుకోవాలని తెలంగాణ పెట్రోల్‌ డీలర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి హెచ్‌పీసీఎల్‌ డీజీఎం టీరాజేశ్‌కువినతిపత్రం అందజేశారు. ఈ-పేమెంట్స్‌ ద్వారా వినియోగదారులు డబ్బు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు.


logo