మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 14:45:31

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం: సీఎం కేసీఆర్‌

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న   భోజన పథకం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్‌   పెరిగిపోతున్నాయని కేసీఆర్‌ అన్నారు.  ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే  లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని   నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 

జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెక్చరర్‌ రఘురామ్‌ను సీఎం అభినందించారు. ఈ నేపథ్యంలోనే కాలేజీల్లో మధ్యాహ్న  భోజనం పెట్టాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు.  రఘురామ్‌ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి నూతన  భవనాన్ని సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు.  రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం  ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo