శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 11:28:24

పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట : మ‌ంత్రి కేటీఆర్

పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెద్ద‌పీట వేశార‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌ను మెరుగుప‌రిచామ‌ని తెలిపారు. ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే హైద‌రాబాద్ ఆద‌ర్శంగా ఉంద‌న్నారు. 

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్మాణ వ్యర్థాలు తరలించే ఆధునిక (కాంప్యాక్టర్‌) స్వచ్ఛ వాహనాలను, సంజీవయ్యపార్కు వద్ద ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద‌యం ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న‌గ‌రంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా ఇంటింటి నుంచి చెత్త సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం 2 వేల స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్త‌ను సేక‌రిస్తున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే మో 2,700 ఆధునిక చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌ను ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు.  చెత్త ట్రాన్స్‌ఫ‌ర్ సెంట‌ర్ల‌ను వికేంద్రీక‌రిస్తున్నామ‌ని తెలిపారు. దాంట్లో భాగంగా హైద‌రాబాద్‌లో 90 చెత్త సేక‌ర‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చెత్త వేయ‌కుండా ఉండేందుకే సేక‌ర‌ణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే నెల రోజుల్లో చెత్త‌ను త‌ర‌లించే పాత డొక్కు బండ్లు క‌న‌బ‌డ‌వు. కొత్త సంవ‌త్స‌రంలో అత్యాధునిక బండ్లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. ఇప్ప‌టికే స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ ర్యాంకులో ముందున్నాం. హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా ఎద‌గాలంటే.. అన్ని ర‌కాల హంగులు ఉండాలి. అత్యాధునిక రోడ్లు ఉండాలి. నేరాలు త‌గ్గాలి. పారిశుద్ధ్యం మెరుగుప‌డాలి. పారిశుద్ధ్యానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెద్ద‌పీట వేశార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాలు కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌ర్వాత ప్ర‌జ‌ల్లో ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెరిగింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.