మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 01:31:31

అమెరికాలోనూ ఇంతటి సేవ లేదు

అమెరికాలోనూ ఇంతటి సేవ లేదు

-తెలంగాణ సర్కారుకు నా సలాం

-కరోనాపై పోరాటం అద్భుతం

-ఆరోగ్యశాఖ, పోలీసులు, ఇతర సిబ్బందికి సెల్యూట్‌

-ఇంత జవాబుదారీతనం అమెరికాలోనూ లేదు

-ముందుజాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం   చేస్తున్న పోరాటం అపూర్వం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన సర్వీసు, జవాబుదారీతనం అమెరికాలోనూ లేదు. ముఖ్యంగా ఆరోగ్యశాఖ సిబ్బందికి, పోలీసులకు సలాం చేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాల స్పందన సరిగా ఉంటుందన్న నమ్మకం ఇప్పటిదాకా నాకు లేదు.  కానీ తెలంగాణలో కరోనా కట్టడి చర్యలు నా అభిప్రాయాన్ని మార్చివేశాయి. నమస్తే తెలంగాణతో ‘శాంతా బయోటెక్‌' వరప్రసాద్‌ రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వంచేస్తున్న పోరాటం అపూర్వమని ప్రముఖ పారిశ్రామికవేత్త, శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన సర్వీసు, జవాబుదారీతనం అమెరికాలోనూ లేదన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశాఖ సిబ్బందికి, పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాల స్పందన సరిగా ఉంటుందన్న నమ్మకం తనకు లేదని.. కానీ తెలంగాణలో కరోనా కట్టడి చర్యలు తన అభిప్రాయాన్ని మార్చివేశాయన్నారు. పోలీసులు సైతం రెడ్‌సిగ్నల్‌ పడిన సమయాన్ని వినియోగించుకొని కరోనా నియంత్రణపై అవగాహన కల్పించడం మంచి ఆలోచన అని ప్రశంసించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికట్టడానికి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో, అన్ని విధాలా సమాయత్తమై పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొన్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా తప్పని కొట్టిపారేశారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి రెండుమూడేండ్లు పట్టవచ్చని చెప్పారు. కరోనా వైరస్‌కు చికిత్సలేదని, పాజిటివ్‌ ఉన్నవారికి వచ్చే జ్వరాన్ని తగ్గించేందుకు పారసిటమాల్‌ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వరప్రసాద్‌రెడ్డి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే.. 

అమెరికాలోకూడా లేని సేవ

పదిరోజుల క్రితం మా అమ్మాయి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే.. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. జ్వరంలేదు కానీ, ఇంట్లోంచి కదలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమస్య ఉంటే చెప్పాలని ఫోన్‌ నంబర్లిచ్చారు. మా అమ్మాయి ఇంటికి రాకుండా, పిల్లల దగ్గరికి వెళ్లకుండా.. తనొక్కతే క్వారంటైన్‌లో ఉండిపోయింది. ఎయిర్‌పోర్ట్‌ వద్ద వివరాలు సేకరించిన వైద్యులు.. మొన్న ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇంకో నాలుగురోజులు ఇలాగే ఉండండి.. అని సూచించి వెళ్లిపోయారు. ఆ వైద్యులు.. ఎన్ని ఇండ్లకు ఈ రకమైన ఫాలో అప్‌ చేయాలి? ఇంత సేవ చేయడం నిజంగా గ్రేట్‌. నాకు తెలిసి ఈ రకమైన పద్ధతి అమెరికాలో కూడా లేదు. మనదేశంలో జవాబుదారీతనం, బాధ్యత తీసుకొనే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఉండటం శభాష్‌. నేను సాధారణంగా ప్రతి ప్రభుత్వాన్ని విమర్శిస్తా. ఇప్పుడు సెల్యూట్‌ చేస్తున్నా.

వ్యాక్సిన్‌ తయారుకాలేదు

కరోనా వ్యాక్సిన్‌ ఇప్పట్లో వస్తుందనేది అవాస్తవమే. వ్యాక్సిన్‌ తయారుచేయాలంటే ఆరు నెలలు పడుతుంది. తర్వాత క్లినికల్‌ ట్రయల్స్‌లో దాదాపు రెండు వందల ఎలుకల మీద ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదారు వేల మందిమీద ప్రయోగించాల్సి ఉంటుంది. వీరిని సమీకరించడానికే ఆరేడు నెలల సమయం పడుతుంది. ఇందులో వివిధ వయస్సులవారు, స్త్రీలు, పురుషులు ఉండేలా చూసుకొంటారు. వ్యాక్సిన్‌ ప్రయోగించిన తర్వాత ఆరేడు నెలలపాటు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తారు. తర్వాత ప్రపంచంలోని వివిధ జాతులు, ప్రాంతాల వారిపై ప్రయోగిస్తారు. ఇదంతా జరుగటానికి రెండు,మూడేండ్లు పట్టొచ్చు. వ్యాక్సిన్‌ కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. రేపు వస్తుంది.. త్వరలో వస్తుంది అన్న ప్రచారంలో వాస్తవంలేదు. కరోనా వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి శాంతాబయోటెక్‌ ప్రయత్నించడంలేదు.జ్వరానికి మందు పారసిటమాలే

పారసిటమాల్‌ ధర్మం ఏమిటంటే జ్వరాన్ని తగ్గిస్తుంది. కరోనా సోకిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించే క్రమంలో పారసిటమాల్‌తో వైద్యంచేస్తున్నారు. జ్వరం అనేది నిరంతరంగా ఉంటే ఇతర అవయవాలకు దెబ్బ తగులుతుంది. 103 దాటితే పారసిటమాల్‌తోపాటు, యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ఇస్తారు. కరోనా చికిత్సలో భాగంగా జ్వరం తగ్గాలంటే పారసిటమాలే ఉపయోగించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇదేచెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉండవచ్చు. అవి చిన్న జాగ్రత్తలే అయినా ఎంతో ప్రభావంచూపుతాయి. మన ఆహారమే గొప్ప ఔషధం

చెప్పులను ఏసీ దుకాణంలో కొనుక్కొంటాం. అదే పండ్లు, కూరగాయలను రోడ్డుమీద కొంటాం. మన ఆహారపుటలవాట్లు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి మన ఆహారంలోనే ఔషధ గుణాలున్నాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి యాంటీ వైరల్‌ డ్రగ్‌లాగా పనిచేస్తాయి. పసుపు, జీలకర్ర, నువ్వులు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, మిరియాలు, ఇంగువ.. ఇవన్నీ ఔషధాలే. మనం వాడే ఏ ఒక్క గొప్ప పదార్థం కూడా పాశ్చాత్యుల ఆహారంలో లేదు. అందుకే వాళ్లకు ఎక్కువ రోగాలువస్తాయి. ఇప్పుడు మన శరీరవిధానం మారిపోవటం, ఒత్తిడి ఎక్కువ కావటం వల్ల రోగాలు వస్తున్నాయి. బతుకు అంటే డబ్బు సంపాదించడమే కాదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి రోగాల గురించి, వాటికి వైద్యం గురించి మన పూర్వికులు, ఋషులు ఏనాడో చెప్పారు. కానీ ఇప్పటి తరంవారు విస్మరిస్తున్నారు. ఇకనైనా వాటిని గౌరవించి, పాటిస్తే భవిష్యత్‌లో ఆరోగ్యంగా జీవించవచ్చు. logo
>>>>>>