గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 13:40:35

విద్యుత్‌ రంగంలో అద్భుతమైన విజయం

విద్యుత్‌ రంగంలో అద్భుతమైన విజయం

హైదరాబాద్‌ : విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించిందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యుత్‌ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా, చాకచక్యంగా వ్యవహరించిందని గవర్నర్‌ తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ రంగంలో అనితర సాధ్యమైన విజయాలు సాధించిందని చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి విద్యుత్‌ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా నిలబడి ఉందన్నారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో అంతకుమించి, 13,168 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వచ్చిందన్నారు.

ఇంత పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడినప్పటికీ ఎక్కడా ఏ మాత్రం కోతలు, లోటు లేకుండా రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా చేసుకోగలిగామని గవర్నర్‌ పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘన విజయమని ఆమె అన్నారు. నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసుకోగలుగుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉంటే, నేడు తెలంగాణ రాష్ర్టానికి 16,246 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందని గవర్నర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతుందని గవర్నర్‌ తమిళిసై స్పష్టం చేశారు.


logo