శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 18:44:27

ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రతిపాదించిన కొత్త ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టు కడుతున్నారని, ఆ ప్రాజెక్టును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టం అంశాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు కడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. బోర్డు చైర్మన్ ను కోరింది. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని పేర్కొన్నారు. దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంచేయాలని, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని, కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

రోజుకు 10 టీఎంసీలపైనే తరలింపు!

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణాజలాలను ఎత్తి కుడి ప్రధాన కాల్వలో పోయడంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకుగాను విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను సైతం 30వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచాలని తీర్మానించింది. ఈ పనులకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయానికి పాలనా ఆమోదం తెలుపుతూ ఈ నెల 5వ తేదీన జీవో జారీచేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల జలాల తరలింపు లక్ష్యంగా అందులో పేర్కొంది. కానీ ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి ఐదున్నర టీఎంసీల వరకు జలాల్ని తరలించే వ్యవస్థ ఉండగా అదనంగా ఈ పనులు చేపట్టడంతో 1.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో రోజుకు 10 టీఎంసీల జలాల్ని ఏపీ తరలించుకుపోతుందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. 

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు పాలనా సభ్యుడిగా రజత్‌ కుమార్‌

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు పాలనా సభ్యుణ్ని ప్రభుత్వం నియమించింది. రెండు బోర్డుల్లో పాలనా సభ్యుడిగా ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌ను నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


logo